హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులకు సంబంధించిన అదనపు చార్జీల బకాయిలు రూ.179 కోట్లు చెల్లించాలని రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు కేంద్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్ (సీఈఆర్సీ) ఇచ్చిన నోటీసుపై హైకోర్టు స్టే విధించింది. అయితే విద్యుత్తు సరఫరాలో తేడా వల్ల విధించే తాజా చార్జీలను చెల్లించాలని చెప్పింది. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులను సమన్వయం చేస్తూ గ్రిడ్‌కు అదనపు వి ద్యుత్తు అందించినందుకు రూ.179 కోట్లు బకాయిలు చెల్లించాలని సీఈఆర్సీ సుమో టో ఆదేశాలు ఇవ్వడాన్ని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ హైకోర్టులో సవాలు చేశాయి.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ పీ శ్యాంకోశీతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రెగ్యులేటరీ నిబంధనలు 2024 సెప్టెంబర్ 16 నుంచి అమల్లోకి వచ్చాయని, అంతకుముందున్న బకాయిలు కూడా చెల్లించాలని నోటీసు ఇవ్వడం చట్టవ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. ఇదేతరహా నోటీసుల అమలును నిలిపివేస్తూ ఇటీవల కేరళ, మద్రాసు హైకోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయని గుర్తుచేశారు.వాదనల తర్వాత ధర్మాసనం.. రూ.179 కోట్ల పాత బకాయిల చెల్లింపునకు సంబంధించిన నోటీసు అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.