వరంగల్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రేవంత్ సర్కార్ సాగిస్తున్నది కక్ష రాజకీయాలు.. కుట్రల పాలన అని మరోసారి తేలిపోయింది. బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్‌పై కక్షగట్టి అభాసుపాలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ పాలన సాగిస్తున్నదని హై కోర్టు తీర్పుతో వెల్లడైపోయింది. కేసీఆర్ హ యాంలో జరిగిన అభివృద్ధిని తన పాలనలో సాగే ప్రతిచర్యలను ప్రజలు పోల్చుకొనే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో వారి దృష్టిని మళ్లించడం, కేసీఆర్ కీర్తికి మకిలి అంటించడం అనే ద్విముఖ లక్ష్యాలతో రేవంత్ సర్కార్ వచ్చీరాగానే అటు విద్యుత్తు కోనుగోళ్లపై, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ‘విచారణ’ పే రిట కమిషన్లు వేసింది. ఈ రెండు కమిషన్ల వి చారణ ప్రక్రియలో అవి అనుసరించిన మా ర్గం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైదనే సత్యా న్ని న్యాయస్థానాలు గుర్తించడం విశేషం. ఈ రెండు కమిషన్ల నేపథ్యంగా న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలు, రేవంత్ సర్కార్‌కు ఇచ్చిన డైరెక్షన్లు.. కేసీఆర్ సంకల్పం వెనుక సచ్ఛీలతను మరోమారు చాటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజం నిలకడ మీద తెలుస్తుందనడానికి న్యాయస్థానాల వ్యాఖ్యలే నిదర్శనమనే అభిప్రాయాలు రాజకీయాలకు అతీతంగా వ్యక్తమవుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యత్తు ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించి కేసీఆర్ హయాం లో తీసుకొన్న నిర్ణయాలపై రేవంత్ సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరగానే జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. తన ఎదుట హాజరుకావాలంటూ కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఆ గడువు ముగియకముందే జస్టిస్ నర్సింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందంలో ధర అధికంగా ఉన్నదని, విద్యుత్తును ఇతర సం స్థల నుంచి కొనుగోలు చేయడం వల్ల రాష్ర్టానికి నష్టం జరిగిందని, విద్యుత్తు ఉత్పత్తి ప్లాం ట్లలో వినియోగించేందుకు ఎంచుకున్న సాంకేతికత వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టమని, భద్రాద్రి ప్లాంట్‌కు రైల్వేలైన్ నిర్మాణం పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టడం వల్ల కో ట్లాది రూపాయలు నష్టం చేకూరిందని ఇలా అనేక అంశాలను ఏకసభ్య కమిషన్ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ నర్సింహారెడ్డి మీడియాకు వివరించారు. ఈ చర్యను ఆక్షేపిస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిజనిర్ధారణ కమిషన్ అప్పటివరకు చేసిన విచారణ విషయాలను మాత్రమే జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి వెల్లడించారని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వాద, ప్రతివాదనలు కొనసాగడం, నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నిబంధనలు అతిక్రమించారనే నిర్ధారణకు వస్తున్నదనే అభిప్రాయానికి రావడంతో కమిషన్ చైర్మన్ పదవికి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి రాజీనామా చేశారు.
కేసీఆర్‌పై తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆదరణ, అభిమానాన్ని దెబ్బతీయాలన్న లక్ష్యం తో రేవంత్ సర్కార్ రెండు కమిషన్లను వేయడంలోని అసలు ఉద్దేశాలను న్యాయస్థానాలు పటాపంచలు చేశాయని కేసీఆర్ విరోధులు కూడా అంగీకరిస్తుండటం విశేషం. ప్రభుత్వం ఎంత ఆడంబరంగా చెప్పినా అబద్ధాలు ని జాలు కావని, నిజం నిలకడ మీద తెలుస్తుందని నిన్న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్, నేడు పీసీ ఘోష్ కమిషన్‌పై వచ్చిన తీర్పులే నిదర్శమని రూఢీచేస్తున్నాయి. మొత్తంగా వి ద్యుత్తు కొనుగోళ్ల విషయంలో బీఆర్ఎస్ పాలనపై, నాటి సీఎం కేసీఆర్‌పై ఉద్దేశపూర్వకంగానే రేవంత్ సర్కార్ తప్పులు ఆపాదించింద ని, అది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కమిషన్లేనని తెలంగాణ సమాజం గుర్తించడం విశేషం.
కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కేసీఆర్ ను, బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే ఉద్దేశం తో కమిషన్ వేసిందనే విషయం బుధవారం హైకోర్టు తీర్పుతో మరోసారి తేలిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ సర్కార్ కేసీఆర్‌ను ప్రజల ముందు దోషిగా నిలుపాలనే పథకం ప్రకారమే కుట్రచేసింద ని, అందులో భాగంగానే జస్టిస్ ఘోష్ కమిషన్ తీరు ఉన్నదంటూ బీఆర్ఎస్ చేస్తున్న వాదనతో హైకోర్టు ఏకీభవించిందనే అభిప్రా యం వ్యక్తమవుతున్నది. సర్కార్ ఏ ఉద్దేశాలనైతే కేసీఆర్‌పై మోపాలని భావించిందో.. క మిషన్ చర్యలు, అది చేసిన ప్రతిపాదనలు అలాగే ఉన్నాయని న్యాయస్థానం గుర్తించడం తెలంగాణ ప్రజల విజయంగా హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ అభివర్ణించింది. కమిషన్ ఇచ్చిన నివేదికలోని వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా, రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా, రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వెల్లడించడం రాజకీ య దురుద్దేశంలో భాగమేనని తేలిపోయిం ది. కేసీఆర్ వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టకు భం గం కలిగించేందుకు కుట్రలు చేసిందనే విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించింది.