Lagacharla | కొడంగల్, మార్చి 6: లగచర్ల తదితర గ్రామాల్లో ప్రభుత్వం భూములు సేకరించడంపై హైకోర్టు స్టే విధించడంతో ఆ గ్రామాల్లో అనందం వెల్లివిరిసింది. కాగా, ఇప్పటికే స్థానికులపై ప్రభుత్వం అనేక కేసులు పెట్టి జైల్లో వేయడం, బెయిల్‌పై ఉన్న వారందరూ వారం వారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సి ఉన్నందున గురువారం ఎక్కువసేపు స్టేషన్లోనే గడపాల్సి వచ్చింది. లగచర్ల రైతుల పోరాటం దేశానికే స్పూర్తిదాయకంగా నిలిచింది. రైతులు తమ భూములను కాపాడుకోవడానికి ఎక్కడికైనా వెళ్లగలరని, భూములను కాపాడుకోగలరని హైకోర్టు స్టేతో నిరూపించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీల ఏర్పాటులో భాగంగా భూసేకరణకు కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి రైతులు అలుపెరగని పోరాటం చేశారు. భూములు ఇవ్వబోమని రైతులు ఖరాఖండిగా చెప్పినప్పటికీ, అధికారులు మాత్రం తరచూ రైతులతో సమావేశాలు, అభిప్రాయ సేకరణ అంటూ భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో అధికారుల వాహనాలపై దాడి జరిగింది.
దీంతో అనేకమంది అమాయక రైతులపై కేసులు పెట్టి, అరెస్టులు చేయడంతో నెల రోజులకుపైగా జైలు జీవితం గడిపారు. పోరాటం ఉధృతం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేసింది. భూ సేకరణ కోసం అధికారులు సర్వే పనులు చేపట్టారు. రైతులు భూములను స్వచ్ఛందంగా అందిస్తే రూ.20 లక్షలు, ఇంటి స్థలం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ఆశ చూపింది. ఆయా గ్రామాల్లోని అసైన్డ్ భూముల సర్వేతోపాటు రైతుల వద్ద నుంచి అనుమతి తీసుకొని రైతులకు నష్టపరిహారం కింద చెక్కులను పంపిణీ చేసింది. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రోటిబండతండా, పులిచెర్లకుంట తండాల రైతులు స్పష్టంచేశారు. అధికారులు పోలీసులను మోహరించి అసైన్డ్ భూములతోపాటు పట్టా భూముల్లో గ్రామ, తండాల్లో ముమ్మరంగా సర్వేలు పూర్తిచేశారు.
ఏడాదిన్నరగా పోరాటం
తమ భూములను తాము కాపాడుకోవడానికి రైతులు ఏడాదిన్నరగా భూ పోరాటం నిర్వహించారు. పోలీసు కేసుల కారణంగా ఇల్లు-వాకిలి విడిచి తిండీతిప్పలు లేకుండా పోలీస్‌ష్టేషన్, అధికారుల చుట్టూ తిరిగారు. భూములను కాపాడుకోవడానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ డిమాండ్స్ వినిపించారు. అంతేకాకుండా హైకోర్టును ఆశ్రయించి, న్యాయపోరాటం సాగించి, చివరకు విజయం సాధించారు. తమ పక్షాన న్యాయం ఉన్నందుకే కోర్టు ద్వారా తమకు ఊరట లభించిందని రైతులు చెప్తున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ గురువారం కోర్టు స్టే విధించడంపై సంతోషం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రైతు పక్షాన న్యాయం ఉన్నదని సీఎం గ్రహించి, భూముల జోలికి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
సొంత నియోజకవర్గంలోనే సీఎంకు ఎదురుదెబ్బ
గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతూ ఎన్నో అద్భుత పథకాలను అమలుచేసి వ్యవసాయాన్ని పండుగలా చేసిందని, కాబట్టే దేశంలోనే అత్యధికంగా వరి పంటను పండించి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా ఏర్పడిందని రైతులు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను భిక్షగాడిని చేసే విధంగా కుట్రలు పన్నిందని వాపోయారు. భూములను లాక్కొని రైతు కంటనీళ్లు తెప్పించిందని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలో పరిస్థితి ఈవిధంగా ఉండటం బాధకరమని, కోర్టు స్టేతో సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలిందని వ్యాఖ్యానిస్తున్నారు. లగచర్ల లడాయిలో ప్రజలే గెలిచారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని సొంతవారి ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి అమాయక గిరిజనుల భూములు లాక్కోవాలని చూసిన లగచర్ల లడాయిలో ప్రజలే గెలిచారు. రేవంత్‌రెడ్డి దమనకాండను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ లగచర్ల రైతులకు అండగా నిలిచి కేసుల నుంచి కాపాడింది. రైతుల పక్షాన చేసిన న్యాయ పోరాటంలో విజయం సాధించింది. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడే పార్టీ బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రజల నమ్మకం ఇప్పుడు మరింతగా బలపడింది. -గోపగాని రఘురాం, బీఆర్ఎస్ నేత
ఒకపక్క సంతోషం.. మరోపక్క బాధ
భూములు తీసుకోవద్దని కోర్టు స్టే ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. భూములను దక్కించుకోవడానికి చాలా బాధలు పడ్డాం. కేసులు అయ్యాయి. ప్రతి వారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నాం. కోర్టు స్టే ఇవ్వడంతో మా కష్టం ఫలించింది. మాపై ఉన్న కేసులు కూడా ఎత్తేయాలని కోరుతున్నం. మా ప్రాణాలు పోయి నా సరే మా భూములు ఇవ్వం. మా భూములే మా బతుకు, మా పిల్లలకు ఆధారం.
-పాత్లావత్ రుక్కమ్మ, రోటిబండతండా, దుద్యాల మండలం
నియంత ప్రభుత్వంపై లగచర్ల రైతుల ఘన విజయం
హైకోర్టు స్టే ఇవ్వడంతో నియంత ప్రభుత్వంపై లగచర్ల రైతులు ఘన విజయాన్ని సాధించారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రైతులను ఇబ్బందిపెట్టింది. ఏడాదిన్నరగా బాధలు పడుతూ రైతులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అడుగులు వేశారు. కోర్టు స్టేతో రైతుల బాధలు తొలగిపోయాయి. రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఇందుకు కేటీఆర్, పట్నం నరేందర్‌రెడ్డికి ధన్యవాదాలు.
-సురేష్, లగచర్ల, దుద్యాల మండలం
తండా కోసమే మా పోరాటం
ఏండ్లుగా ఈ ప్రాంతంలో ఇండ్లు కట్టుకొని ఒకే కుటుంబంగా బతుకుతున్నం. భూములు ఇవ్వాలంటూ సీఎం మా గిరిజన రైతులను బాధ పెడుతుండు. పోలీసు కేసు కూడా పెట్టారు. ఇల్లు, పిల్లలను వదిలి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నం. కోర్టు స్టే ఇవ్వడం సంతోషంగా ఉన్నది.
-సుమిత్రబాయి, రాజునాయక్, రోటిబండతండా