హైదరాబాద్ జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభకు 2018లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్లో సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టు కమిషనర్ ఎదుట హాజరుకావాలని బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. 2019లో దాఖలైన ఈ ఎలక్షన్ పిటిషన్‌పై జస్టిస్ జీ రాధారాణి శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఇటీవల కేంద్ర మం త్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ అధికార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది పేర్కొంటూ.. కోర్టు కమిషనర్ ఎదుట హాజరయ్యేందుకు మరికొంత గడువు ఇవాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. బండి సంజయ్‌కి మరో అవకాశం ఇచ్చారు. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేశారు. ఆ లోగా అడ్వకేట్ కమిషన్ ఎదుట సాక్ష్యం ఇవ్వని పక్షంలో గంగులపై దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌ను మూసివేస్తామని స్పష్టం చేశారు.