హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): డీఆర్డీవో బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి నియామకం చెల్లదని పేరొంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. డీజీ నియామక ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని డీఆర్డీవోను ఆదేశించింది. డీజీగా తనకంటే జూనియర్ అయిన జైతీర్థ జోషిని నియమించారంటూ శివసుబ్రమణ్యం నంబినాయుడు క్యాట్‌ను ఆశ్రయించారు.
డీజీగా జైతీర్థ నియామకాన్ని రద్దు చేయడంతోపాటు ఈ పోస్టుకు డాక్టర్ శివసుబ్రమణ్యం నంబి నాయుడు అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాలని క్యాట్ కేంద్రాన్ని ఆదేశించింది. క్యాట్ తీర్పును సవాలు చేస్తూ జైతీర్థ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, ఎవర్ని నియమించాలన్న విచక్షణాధికారాలు రక్షణశాఖకు ఉంటాయని తెలిపారు. ఇది దేశరక్షణకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. విచారణను కోర్టు ఫిబ్రవరి 24వ తేదీకి వాయిదా వేసింది.