హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ జిల్లాల్లో న్యాయసేవాధికార సంస్థలను హైకోర్టు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో ఇప్పటికే జిల్లా కోర్టులు ఏర్పాటవడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం వర్చువల్‌గా ఆయా జిల్లాల్లో న్యాయసేవాధికార సంస్థలను ప్రారంభించారు. పూర్వపు 10 జిల్లాల్లో ఇదివరకే న్యాయసేవాధికార సంస్థలు ఉండటంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో న్యాయసేవాధికార సంస్థల విధులు మొదలయ్యాయి. ఈ సందర్భంగా జస్టిస్ భూయాన్ మాట్లాడుతూ.. ప్రతి ఒకరికీ న్యాయం అందించడమే న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమన్నారు. వీటి ఏర్పాటుతో బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయం అందించాలన్న లక్ష్యం మరింత త్వరగా నెరవేరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో న్యాయసేవాధికార సంస్థల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ పీ నవీన్‌రావు,ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
కొత్తగా న్యాయసేవాధికార సంస్థలు ఏర్పాటైన జిల్లాలు
కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, మెదక్, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మేడ్చల్ మలాజ్‌గిరి, వికారాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్.
14 ఏండ్ల వివాదం.. తొలిరోజే పరిష్కారం
జనగామ జిల్లాలో తాజాగా ఏర్పాటైన న్యాయసేవాధికార సంస్థ తొలి రోజే 14 ఏండ్లనాటి సివిల్ వివాదాన్ని పరిషరించింది. తండ్రీ, కొడుకుల మధ్య కొనసాగుతున్న ఈ వివాదాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ శైలజ, ఇన్చార్జి కార్యదర్శి పీ ఆంజనేయులు ప్రత్యేక చొరవతో విజయవంతంగా పరిషరించారు.