HYDRAA | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. హెచ్చరిస్తున్నా హైడ్రా తన పంథాను మార్చుకోవడం లేదంటూ మండిపడింది. ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నదంటూ నిప్పులు చెరిగింది. కూల్చివేతలు తెల్లవారుజామునే ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని పట్టుబట్టింది. సంధ్య కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ఇలా స్పందించింది. అవి చట్ట విరుద్ధ నిర్మాణాలైనా కూల్చివేసేటప్పుడు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఇటీవల ఆదేశించినప్పటికీ ఎందుకు అమలు కావడం లేదని నిప్పులు చెరిగింది. హైడ్రా కమిషనర్‌ను కోర్టు పిలిచి చెప్పినా మళ్లీ పాత పంథానే ఎందుకుఅనుసరిస్తున్నారని ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నం.124, 125లో సంధ్య కన్వెన్షన్ నిర్మాణాల కూల్చివేతలపై దాఖలైన కోర్టు ధికరణ పిటిషన్లపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం మరోసారి విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎంఎస్ ప్రసాద్, బీ మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
జీహెచ్ఎంసీ అనుమతులున్నా..
జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకుని సంధ్య కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టిందని, హైడ్రా ఎన్వోసీ ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ సోమవారం హైడ్రా కూల్చివేతలు చేట్టిందని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ హైడ్రా ఖాతరు చేయలేదని పేర్కొన్నారు. కూల్చివేతలకు ముందు పిటిషనర్లకు నోటీసు కూడా ఇవ్వలేదని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. హైడ్రా తమ వాదన వినకుండా కూల్చివేసిందని, పైగా హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నట్టు చెప్పిందని వాదించారు.
హైడ్రాకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హైడ్రాకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని తెలిపారు. హౌసింగ్ సొసైటీ అంతర్గత రోడ్లపై నిర్మాణాలు జరిగాయని చెప్పారు. అంతర్గత రోడ్ల వ్యవహారంలో హైడ్రాజోక్యం చేసుకోవచ్చా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ సొసైటీ ఎఫ్టీఎల్, ప్రభుత్వ భూమి కూడా కాదని, అలాంటప్పుడు సొసైటీలో ఎవరి సూచనలతో హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని నిలదీసింది. సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై వివరాలు సమర్పించాలని హైడ్రాతోపాటు జీహెచ్ ఎంసీలను ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.