e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home Top Slides దేవుడి భూముల లెక్కలు తేల్చవద్దా?

దేవుడి భూముల లెక్కలు తేల్చవద్దా?

దేవుడి భూముల లెక్కలు తేల్చవద్దా?
  • ఆక్రమణలు కొనసాగాలనుకొంటున్నారా?
  • పిటిషనర్లను నిలదీసిన రాష్ట్ర హైకోర్టు
  • 1014 జీవో సస్పెన్షన్‌కు తిరస్కరణ
  • నోటీసులు ఇచ్చిన తర్వాత పిటిషనర్లు సహకరించకపోతే చర్యలు తీసుకోవచ్చు
  • ఐఏఎస్‌ల కమిటీకి హైకోర్టు ఆదేశం

దేవుడి భూముల రక్షణకు తీసుకొనే చర్యలను ఎందుకు అడ్డుకొంటున్నారు? ఆక్రమణదారులు ఉంటే వాళ్ల బండారం బట్టబయలు కావాల్సిందే. ఇది జరగాలంటే కమిటీ తన విధులు నిర్వహించాల్సిందే. దాతలు ఆలయాలకు ఇచ్చిన భూములకు రాష్ట్ర ప్రభుత్వమే ధర్మకర్త. ఆ భూములపై అధ్యయనం కోసం కమిటీ వేస్తే వద్దనడం చట్ట వ్యతిరేకం. – హైకోర్టు వ్యాఖ్యలు

హైదరాబాద్‌, జూన్‌ 17 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్‌ గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయ భూ ముల ఆక్రమణలను తేల్చేందుకు నలుగురు ఐఏఎస్‌ అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేయడంలో తప్పేమిటని హైకోర్టు ప్రశ్నించింది. కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 1014 అమలును ఎందుకు నిలిపివేయాలని నిలదీసింది. ఆలయ భూముల వాస్తవ స్థితిగతులను తేల్చేందుకు సర్వేచేస్తే ఇబ్బందేమిటని అడిగింది. ఆలయ భూములను గుర్తించవద్దని ఎలా కోరతారని సర్వేను ఆపాలంటూ వ్యాజ్యాన్ని దాఖలుచేసిన పిటిషనర్లపై మండిపడింది. ఆలయ భూములు అన్యాక్రాంతమవుతుంటే.. ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆలయ భూములపై సర్వేచేసి, ఏమేరకు భూమి ఆక్రమణకు గురైందో తేల్చేందుకు ఐఏఎస్‌ల కమిటీ వేయడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వం మే 3వ తేదీన జారీ చేసిన జీవో 1014ను సవాల్‌ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన సదా కేశవరెడ్డి, సదా సత్యనారాయణరెడ్డి, ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టీ అమర్‌నాథ్‌గౌడ్‌ మరోసారి విచారణ జరిపారు. ఆలయ భూములపై సర్వేచేసే అధికారం ప్రభుత్వం నియమించిన కమిటీకి ఉన్నదని హైకోర్టు తేల్చిచెప్పింది. జీవోను సస్పెండ్‌చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీచేసింది. నోటీసులు ఇచ్చిన తర్వాతే కమిటీ సర్వే చేయాలన్న అభ్యర్థనను మాత్రం ఆమోదించింది. నోటీసుల జారీ తర్వాత భూముల్లోకి వెళ్లేందుకు కమిటీ సభ్యులకు ఆటంకం కలిగించినా, కమిటీకి సహకరించకపోయినా చట్ట ప్రకారం పిటిషనర్లపై చర్యలు తీసుకొనే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. కమిటీకి పిటిషనర్లు భూములపై హకులకు సంబంధించిన పత్రాలు, ఇతర వివరాలు అందజేయాలని ఆదేశించింది. సర్వే చేయరాదన్న వాదనను ఆమోదించలేమని తేల్చి చెప్పింది. కాగా, భూముల్లో వాస్తవ పరిస్థితులను బేరీజు వేసేందుకు మాత్రమే కమిటీ సర్వే చేస్తుందని, ఆలయ భూముల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు లేదా ఆలయ భూముల్లోని వారిని తొలగించే ప్రయత్నాలు చేయబోమని గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చిందని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది హరీందర్‌ పరిషద్‌ కోర్టుకు వివరించారు. కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇస్తుందని, ఇందుకోసం జరిగే తొలి దశ అధ్యయనానికి వేసిన కమిటీని అడ్డుకోవడం సరికాదన్నారు. ఆలయ భూముల్లోకి కమిటీ వెళ్లే ముందు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీచేస్తామన్నారు. జీవో 1014ను సస్పెండ్‌ చేయాలని పిటిషనర్‌ న్యాయవాది వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు.. ప్రతివాదులైన సాధారణ పరిపాలన (జీఏడీ), పురపాలక, దేవాదాయ, ధర్మాదాయశాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు దేవాదాయశాఖ కమిషనర్‌, మేడ్చల్‌ మలాజిగిరి జిల్లా కలెక్టర్‌, దేవరయాంజల్‌ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రత్యేకాధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

- Advertisement -

పిటిషనర్‌కు ప్రశ్నలు సంధించిన హైకోర్టు
విచారణ సమయంలో కమిటీని సస్పెండ్‌ చేయాలన్న వాదనను తప్పుపడుతూ పలు ప్రశ్నలతో పిటిషనర్‌ను ఉకిరిబికిరి చేసింది. సర్వేను ఎందుకు అడ్డుకొంటున్నారు? విచారణలో భాగంగా సర్వే చేస్తే మీకు వచ్చే నష్టం ఏమిటి? కమిటీ బాధ్యత నిర్వహిస్తే తప్పేమిటి? ఆక్రమణలను గుర్తించకూడదని భావిస్తున్నారా? ఆలయ భూములు ఏమిటో తేలకూడదని అనుకొంటున్నారా? భూఆక్రమణలు కొనసాగాలని కోరుకుంటున్నారా? ఆక్రమణదారులను కొనసాగించాలా? ఏమనుకొంటున్నారు? కమిటీ సర్వే జరిపితే కబ్జాలు ఉంటే తేలుతుంది కదా? దేవుడి భూముల రక్షణకు తీసుకొనే చర్యలను ఎందుకు అడ్డుకొంటున్నారు? అని హైకోర్టు పిటిషనర్‌కు ప్రశ్నలు సంధించింది. ఆక్రమణదారులు ఉంటే వాళ్ల బండారం బట్టబయలు కావాల్సిందే. ఇది జరగాలంటే కమిటీ తన విధులు నిర్వహించాల్సిందే. దాతలు ఆలయాలకు ఇచ్చిన భూములకు ప్రభుత్వమే ధర్మకర్త. ఆ భూములను అధ్యయనం కోసం కమిటీ వేస్తే వద్దనడం చట్ట వ్యతిరేకం.. అని వ్యాఖ్యానించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దేవుడి భూముల లెక్కలు తేల్చవద్దా?
దేవుడి భూముల లెక్కలు తేల్చవద్దా?
దేవుడి భూముల లెక్కలు తేల్చవద్దా?

ట్రెండింగ్‌

Advertisement