హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కొడుకు కే వెంకటేశ్వరరావు, కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి చెందిన స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. కేకే కొడుకు, కూతురును ప్రత్యేక క్యాటగిరీలుగా పరిగణిస్తూ రెగ్యులరైజ్ ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించేటప్పుడు ప్రభుత్వ విధానం ప్రజలందరికీ సమానంగా ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. జరిగిన తప్పును ప్రభుత్వం సరిదిద్దుకోవాలని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ప్రభుత్వం ప్రతిష్టకు పోతే తాము ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని, ఆ ఆదేశాలు కఠినంగా ఉంటాయని తేల్చి చెప్పింది. ప్రభుత్వ స్థలం క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం కొందరికి అనుకూలంగా ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించింది.
రిజిస్ట్రేషన్ లేకుండా చేతులు మారుతూ వచ్చినా, ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉన్నట్లేనని వ్యాఖ్యానించింది. ఇలాంటి స్థలం క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఒక విధానాన్ని రూపకల్పన చేస్తే అది ప్రజలందరికీ ఒకే తీరుగా ఉండాలని స్పష్టంచేసింది. ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేయడం ఏమిటని ప్రశ్నించింది. ప్రైవేటు వ్యక్తులపట్ల ఉదారంగా ఉండాల్సిన అవసరం ఏమిటని నిలదీసింది. ఇదే విధానాన్ని ప్రజలందరికీ అమలుచేయకపోవడం ద్వంద్వ విధానమే అవుతుందని అభిప్రాయపడింది. మురికివాడల్లో కూడా స్థలం క్రమబద్ధీకరణకు పరిమితి ఉన్నదని గుర్తు చేసింది. కేకే కొడుకు, కూతురుల స్థలాల విషయంలో స్థల పరిమితిని ఎందుకు అమలుచేయలేదని నిలదీసింది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు (కేకే) కుమారుడు కే వెంకటేశ్వరరావు, కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి అనుకూలంగా ఇచ్చిన క్రమబద్ధీకరణ ఉత్తర్వుల తీరును తీవ్రంగా ఆక్షేపించింది.
సదరు స్థలం నుంచి ఆ ఇద్దరినీ తొలగించాలని చెప్పడంలేదని, జరిగిన తప్పును ప్రభుత్వం సరిచేయాలని మాత్రమే చెప్తున్నామని వివరించింది. తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవాలని చూస్తే కోర్టు ఉత్తర్వుల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఆ ఉత్తర్వులు కఠినంగా కూడా ఉండవచ్చని హెచ్చరించింది. కేకే కొడుకు, కూతురు స్థలాలను రెగ్యులరైజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో-56ను సవాలు చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన జీ రఘువీర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది.
కారుచౌకగా క్రమబద్ధీకరణ
తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రేయస్‌రెడ్డి వాదిస్తూ.. బంజారాహిల్స్ మురికివాడలో కేకే కుమారుడు వెంకటేశ్వరరావుకు చెందిన 1,181 చదరపు గజాల స్థలాన్ని 1998వ సంవత్సరంలో ఉన్న మారెట్ విలువ రూ.2,500 (చదరపు గజానికి) చొప్పున క్రమబద్ధీకరణ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. కేకే కుమార్తె విజయలక్ష్మికి చదరపు గజం రూ.350 చొప్పున 425 చదరపు గజాలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో-56 చెల్లదని వాదించారు. అయితే, అప్పట్లోనే గజం మారెట్ ధర రూ.60,300 ఉన్నదని వివరించారు. ప్రస్తుతం కోట్ల రూపాయల విలువచేసే స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కారుచౌకగా క్రమబద్ధీకరణ చేయడాన్ని రద్దు చేయాలని కోరారు. కేకే కొడుకు, కూతురు 1998లో క్రమబద్ధీకరణకు అప్లికేషన్ పెట్టుకుంటే అదే ఏడాదిలో ఉన్న ధరలకు రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయడం వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నదని చెప్పారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ ప్రతివాదన చేస్తూ.. ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో ఇచ్చిందని వెల్లడించారు. నాటి ఆర్థిక శాఖ మంత్రికి కేకే కొడుకు, కూతురు వినతిపత్రం సమర్పించారని, ఒక స్థలంలో విద్యుత్తు కనెక్షన్ కూడా ఉన్నదని, దీంతో క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వివరించారు. ప్రభుత్వ వాదనపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. జీవో వెలువరించే నాటికి మారెట్ ధరకు అనుగుణంగా జీవో ఇవ్వకుండా అప్లికేషన్ పెట్టుకున్న ఏడాదిలో ఉన్న రేటు ప్రకారం క్రమబద్ధీకరణ ఎలా చేస్తారని మండిపడింది. ఈ నిర్ణయం తప్పు అని, దీని విషయంలో తప్పును సరిచేసుకునే దిశగా ప్రభుత్వ చర్యలు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ప్రతిష్టకుపోతే పరిణామాలు ప్రతికూలంగా ఉంటాయని హెచ్చరించింది. జరిగిన తప్పును అధికారులు గుర్తించి సరిదిద్దుకోవాలని, సరిదిద్దుకునే చర్యలు తీసుకుంటే ఈ మేరకు కోర్టు రికార్డుల్లో నమోదుకు వీలుగా చర్యలు ఉంటాయని చెప్పింది. తదుపరి విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది.