హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): గూప్-2 పోస్టుల భర్తీకి 2015లో వెలువడిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా నియమితులైన ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్-2 పోస్టుల ఎంపిక జరిగిందంటూ ఈ నెల 18న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ డివిజన్ బెంచ్ గురువారం మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా డబుల్ బబ్లింగ్, వైట్నర్ వాడకం, జవాబు పత్రంలో చెరిపివేతలు, పార్ట్-బీ పత్రాల పునర్ మూల్యాంకనం చేయడం చెల్లదని సింగిల్ జడ్జి తీర్పులో పేరొనగా 2019 అక్టోబర్ 24న వెలువరించిన ఫలితాలను రద్దుచేశారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ క్రాంతికుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. రూల్స్‌కు వ్యతిరేకంగా ట్యాంపరింగ్‌కు పాల్పడిన వాళ్ల పత్రాలను మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ఇన్విజిలేటర్ల అవగాహనరాహిత్యం వల్ల ఓఎంఆర్ వివరాలను బబ్లింగ్ ద్వారా భర్తీ చేయడంలో పొరపాటు జరిగిందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం వేసిన ప్రత్యేక కమిటీ సిఫారసుల మేరకు మూల్యాంకనం జరిగిందని వివరించారు.
డబుల్ బబ్లింగ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరిందని చెప్పారు. సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు ప్రతివాదన చేస్తూ.. ఓఎంఆర్ షీట్ పార్ట్-ఏలోని అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించి పొరపాట్లు ఉంటే ఫర్వాలేదని సాంకేతిక కమిటీ సిఫారసు చేసిందని, పార్ట్-బీలోని 150 జవాబులకు తుడిచివేతలు, వైట్నర్ వాడితే మూల్యాంకనం చేయడానికి వీల్లేదని అన్నారు. పార్ట్ బీలో తుడిచివేతలు, వైట్నర్ వాడిన వారికి మినహాయింపు ఇచ్చి తిరిగి మూల్యాంకనం చేసి నియామకాలు చేపట్టాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవద్దని కోరారు. డివిజన్ బెంచ్ స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీచేస్తూ, విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.