హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మదింపు చేశాక ఆ శాఖ జారీచేసే నోటీసులపై జీఎస్టీ అధికారులు హైకోర్టుకు స్వయంగా వివరించారు. తమ పోర్టల్ పనితీరును వివరించేందుకు జీఎస్టీ కమిషనర్లు స్వయంగా విచారణకు హాజరై గంటన్నరపాటు వివరించారు. కంప్యూటర్ ద్వారా నోటీసుల జారీని ఆన్లైన్లో ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు. చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌కు జీఎస్టీ పోర్టల్ పనితీరును వివరించారు.
జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఇచ్చే నోటీసుల్లో సంతకాలు లేవంటూ దాఖలైన వందలాది పిటిషన్లు హైకోర్టు విచారణలో ఉన్నాయి. నోటీసులకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన సుమారు 150 పిటిషన్లపై గురువారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ట్యాక్స్ కేసులను విచారించే జస్టిస్ పీ శ్యాంకోశీ కూడా విచారణలో పాల్గొంటే బాగుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో జస్టిస్ పీ శ్యాంకోశీ నేతృత్వంలోని మరో ద్విసభ్య ధర్మాసనం తమ కేసుల విచారణను నిలిపివేసి జీఎస్టీ అధికారులు ఇచ్చిన ప్రదర్శనను వీక్షించారు.