హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వికారాబాద్‌లోని దామగుండం రిజర్వ్ అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం తొలగించిన మొకలు, వృక్షాలను వేరే ప్రాంతంలో తిరిగి నాటే చర్యలపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. తొలగించిన చెట్లను మరోచోట నాటి అవి తిరిగి చిగురించి ప్రాణం పోసుకునే వరకు తీసుకునే సంరక్షణ చర్యలను కూడా తెలియజేయాలని నిర్దేశించింది. రాడార్ ప్రాజెక్ట్ సెంటర్ ఏర్పాటు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2,900 ఎకరాల అటవీ భూమిని బదలాయిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ 2020లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.
ఈ సందర్భంగా అమికస్ క్యూరీ (కోర్టు సహాయకారి), సీనియర్ న్యాయవాది వివేక్‌జైన్ వాదనలు వినిపిస్తూ.. తొలగించిన వృక్షాలను తిరిగి నాటాలన్న నిబంధనను ఏ మేరకు అమలు చేశాయో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్ని వృక్షాలను తొలగించారో, తిరిగి వాటిని ఎకడ నాటారో, వాటిలో ఎన్ని బతికాయో నివేదించాలని కేంద, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామంటే సరిపోదని తేల్చిచెప్పింది. బయోడైవర్సిటీ యాక్ట్ కింద ఏర్పాటైన కమిటీ నివేదిక అమలుపై కూడా తెలియజేయాలని పేర్కొన్నది. రాడార్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం అటవీ భూమిని కేటాయించిన నేపథ్యంలో అదనపు అటవీ ప్రాంత అభివృద్ధికి తీసుకునే చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు అందజేయాలని తెలిపింది. చెట్లను తిరిగి నాటుతారని, వాటిపై ఆధారపడి బతికే పక్షులు, జీవరాశుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. పర్యావరణ సమతుల్యత కోసం పక్షులు, సీతాకోకచిలుకలు, క్రిమికీటకాలు, ఇతర జీవరాశుల రక్షణ మాటేమిటని నిలదీసింది. తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.
రాడార్‌తో వన్యప్రాణులపై దుష్ప్రభావం
అమికస్ క్యూరీ వివేక్‌జైన్ వాదనలు వినిపిస్తూ.. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై స్పష్టత లేదని తెలిపారు. 1ః2 నిష్పత్తిలో అటవీ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేయాలనే నిబంధన అమలుపై కేంద్రం మౌనంగా ఉన్నదని చెప్పారు. తొలగించిన అటవీ ప్రాంతానికి రెట్టింపు భూమిలో అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. రాడార్ కేంద్రం నుంచి వెలువడే కిరణాల వల్ల పక్షులు, వన్యప్రాణులపై దుష్ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీని ప్రభావం ఏమేరకు ఉంటుందో ప్రభుత్వాల నుంచి స్పష్టత లేదని, ఏడేండ్లుగా ఎలాంటి పురోగతి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. కౌంటర్ దాఖలు చేశామని, పర్యావరణ ప్రభావ అధ్యయనంపై నేవల్ కమాండర్ అంతర్గత నివేదిక సమర్పించారని, గడువు ఇస్తే ఈ నివేదికపై స్పందిస్తామని చెప్పారు.
సీల్డ్ కవర్లో నివేదికను హైకోర్టుకు అందజేశారు. తొలగించిన వృక్షాలను వేరే చోట తిరిగి నాటే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. బయోడైవర్సిటీ రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ఆ కమిటీ ఉండాలని, కానీ 2024 జనవరి 31 నాటికి సర్పంచ్ పదవీకాలం ముగిసినందున కమిటీ లేదని, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగినందున కమిటీని తిరిగి ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొత్తం 9,538 వృక్షాలను తొలగించామని, అక్టోబర్ చివరి నాటికి 7,822 వృక్షాలను తిరిగి నాటామని, వీటిలో 3,947 వరకు చిగురించాయని చెప్పారు. 263 మాత్రమే బతకలేదన్నారు. మరో 4,212 వృక్షాలు చాలా బాగున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 25 వేల కొత్త మొకలను తమ్మవరంలో నాటుతామని వివరించారు.