హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖానను గోషామహల్ స్టేడియానికి తరలించడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ 4 వారాల తర్వాత చేపడతామని, ఈలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఎంఏయూడీ, హోం, వైద్యారోగ్యం, టూరిజం శాఖల ముఖ్యకార్యదర్శులు, ఆర్థిక, రోడ్లు-భవనాలు, ఈబీఎస్వీ శాఖల స్పెషల్ చీఫ్సెక్రటరీలు, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. ఉస్మానియా దవాఖానను గోషామహల్‌కు తరలించాలన్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన జీ రాము పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.