High Court | హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): క్షేత్రస్థాయిలో లేని భూమి కోసం అస్మాన్జాహి పైగా వారసులు, వారి నుంచి భూమిని కొనుగోలు చేసిన వారు గత 66 ఏండ్లుగా చేస్తున్న న్యాయపోరాటంపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజీ ద్వారా భాగస్వామ్య పరిషార నిర్ణయానికి కక్షిదారులు వచ్చినా.. అసలు అకడ భూమే లేదని హైకోర్టు వెల్లడించింది. భూమే లేనప్పుడు భాగస్వామ్య పరిషారమనే అంశమే ఉత్పన్నం కాబోదని తేల్చిచెప్పింది.
25 గ్రామాల్లో భౌతికంగా ఉనికిలో లేని భూముల కోసం 1958 నుంచి ఈ లిటిగేషన్ కొనసాగుతూ వచ్చింది. కమిషనర్ ఆఫ్ సెటిల్మెంట్ సర్వే 1977లో ఇచ్చిన నివేదికను తోసిపుచ్చుతున్నట్టు హైకోర్టు వెల్లడించింది. 2022లో నియమితులైన కమిషనర్ కమ్ కోర్టు రిసీవర్ సమర్పించిన నివేదిక ప్రకారం ఆయా గ్రామాల్లో పిటిషనర్లు చెప్తున్న భూములు లేవని గుర్తుచేసింది.
లేనిభూముల కోసం ఇనేండ్లుగా లిటిగేషన్ కొనసాగడంపై విస్మయాన్ని వ్యక్తంచేసింది. క్షేత్ర స్థాయిలో భూములే లేనప్పుడు కేసులో విచారణ కొనసాగింపు అవసరం లేదని వెల్లడించింది. పిటిషన్‌పై విచారణను మూసేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. 1977లో కమిషనర్ ఆఫ్ సెటిల్మెంట్ సర్వే రిపోర్టు మేరకు జారీచేసిన ఫైనల్ డిక్రీ చెల్లదని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల ఈ తీర్పు వెలువరించింది.