హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేతల వ్యవహారంలో మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇండ్లు కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వం ఇండ్లు కేటాయిస్తున్న తరుణంలో తాము స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇప్పటికే పిటిషనర్లు సహా అర్హులైనవారికి ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇడ్లు మంజూరు చేస్తున్నందున స్టే వంటి మధ్యంతర ఆదేశాలిస్తే వాళ్లకు అన్యా యం జరుగవచ్చని అభిప్రాయపడింది. వెలుగుమట్ల బాధితులు టీ వెంకటనరసమ్మ, మరో 23 మంది వేసిన వ్యాజ్యాలను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ చేపట్టారు.
ప్రభుత్వ న్యాయవాది కాట్రం మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలోని ఆరుగురికి ప్రభుత్వం పట్టాలతోపాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని చెప్పారు. కూల్చివేతల తరువాత 311 పట్టాలను మంజూరు చేశామని, 101 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లలో కొందరికి పట్టాలు జారీ చేయగా, మరికొందరి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న దశలో స్టేకు నిరాకరిస్తూ విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేశారు.
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అమలవుతున్న అడ్వొకేట్స్ వె ల్ఫేర్ ఫండ్‌ను తెలంగాణ రాష్ట్ర న్యా యవాదుల సంక్షేమ, రక్షణ బిల్లులో చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచన చేయాలని బార్‌కౌన్సిల్ కోరింది. సంక్షేమ అంశాలను బిల్లులో భాగం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదన ఇబ్బందికరమని చెప్పింది. ప్రస్తుతం అమల్లో ఉన్న న్యాయవాదుల సంక్షేమ నిధి ట్రస్ట్‌ను చట్టంలో విలీనం చేయకుండా బార్ కౌన్సిల్ పరిధిలోనే కొనసాగేలా చేయాలని కోరింది. గురువారం రాష్ట్ర బార్‌కౌన్సిల్ కార్యాలయంలో బార్‌కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, సభ్యుడు కొల్లి సత్యనారాయణ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ, రక్షణ బిల్లు న్యాయవాదులకు మేలు చేకూర్చేలా ఉన్నదని చెప్పారు.