హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): వివాహ బంధాలు విచ్ఛిన్నం కాకుండా మధ్యవర్తిత్వంతో కాపాడాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తిత్వం ఒక వరమని, పాశుపతాస్త్రం లాంటి ఆ వరాన్ని అందిపుచ్చుకోవాలని కమ్యూనిటీ వలంటీర్లకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్వల్ప వివాదాలతో వచ్చిన దంపతులను మధ్యవర్తిత్వంతో ఒప్పించి ఏకం చేయాలని శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లకు సూచించారు. మళ్లీ ఆరేడు మాసాల్లో తిరిగి సమావేశమవుదామని, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై చర్చిద్దామని చెప్పారు. త్వరలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు కమ్యూనిటీ సెంటర్లను విస్తరిస్తామని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ గవర్నర్ల బోర్డు ప్రెసిడెంట్ జస్టిస్ కే లక్ష్మణ్ తెలిపారు. కార్మిక చట్టాల్లో మధ్యవర్తిత్వం జరపాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. అనంతరం వలంటీర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.