హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణకు హాజరు కాకపోవడంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన లక్షల ఎకరాల భూముల వివరాలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు అత్యవసర ప్రాతిపదికన పంపాలని, ఆ మేరకు ఈ నెల 10లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్‌ను జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఇదే చివరి అవకాశమని.. లేనిపక్షంలో నేరుగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి హాజరుకాని పక్షంలో కఠినచర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. ఈసారి విచారణకు హాజరుకావాలని గతంలో చెప్పి నా.. రాకపోవడంపై అసహనం వ్యక్తంచేసింది. రెవెన్యూ జీపీ కట్రం మురళీధర్‌రెడ్డి విజ్ఞప్తిమేరకు ఈ సారి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారం గడువు ఇస్తున్నామని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణలో ఎలాంటి మినహాయింపు ఉండదని చెబుతూ.. విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి శంకర్‌హిల్స్ కాలనీలోని 475 గజాల భూమి కొనుగోలుకు సంబంధించి సేల్ డీడ్ స్వీకరించకపోవడాన్ని సవాల్ చేస్తూ గుప్తా రియల్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. గత నెల విచారణ సందర్భంగా న్యాయమూర్తి.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు అనుగుణంగా జీవో 98 ఉన్నదని సంతృప్తి వ్యక్తంచేశారు. సెక ్షన్ 22ఏ ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితాను కలెక్టర్లు ఎప్పటికప్పుడు సబ్-రిజిస్ట్రార్లకు ఎందుకు తెలియజేయలేకపోతున్నారని జీపీని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నదని, 12 వారాలు సమయం కావాలని జీపీ కోరారు. 2023లోనే ఈ మేరకు ఆదేశాలిచ్చామని, ఇప్పుడు అంత సమయం ఇవ్వలేమని జడ్జి నిరాకరించారు. ఎప్పటికప్పుడు భూము ల డాటాను సబ్ -రిజిస్ట్రార్లకు పంపడం ప్రభుత్వ విధి అని తేల్చిచెప్పారు. సెక్షన్ 22ఏ కింద నిషేధించిన ఆస్తుల మొత్తం జాబితాను తొమ్మిది వారాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సంబంధిత సబ్-రిజిస్ట్రార్లకు చేర్చాలని చెబుతూ.. ఈ ప్రక్రియపై ప్రధానకార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. అంతకుమించి సమయం ఇవ్వలేమని.. ఈ పిటిషన్లలోని తీర్పు, మీరు తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
కోర్టుల ఆదేశాలపై ప్రభుత్వం మౌనంగా ఉండకూడదని హైకోర్టు హెచ్చరించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టగా.. ప్రభుత్వం ఈ నెల 1న జారీచేసిన మెమోను మురళీధర్‌రెడ్డి కోర్టు ముందుంచారు. వివిధ సెక్షన్ల కింద నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలు వెంటనే పంపాలని కలెక్టర్‌ను కోరామని.. కలెక్టర్లతోపాటు దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డు నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఈ వివరాలన్నీ క్రోడీకరించి కమిటీ తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ‘అఫిడవిట్ దాఖలు చేయకుంటే సీఎస్‌ను రమ్మని చెప్పాం కాదా.. ఎందుకు హాజరుకాలేదు’ అని ప్రశ్నించారు.