హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోయే భూమిని తనఖా పెడితే స్టేట్ బ్యాంక్ రుణం ఇవ్వడంపై హైకోర్టు విస్తుపోయింది. సదరు భూమిపై హైకోర్టు స్టే విధించినా దానిని తాకట్టు పెట్టుకొని రుణం ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. రూ.200 కోట్ల విలువైన ప్రాజెక్టుకు రూ.500 కోట్లు రుణం మం జూరు చేయడం ఏమిటని నిలదీసింది. రుణం మంజూరు చేసిన బ్యాంకు అధికారిపై కేసు పెట్టారో లేదో చెప్పాలని నిగ్గదీసింది. ఈ బాగోతంపై సీబీఐకి ఫిర్యాదు చేశారో లేదో చెప్పాలని, ఒకవేళ ఫిర్యాదు చేయకపోతే ఎందుకు చేయలేదో వివరించాలని ఆదేశించింది. మీరు చేయకపోతే ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని సీబీఐ దర్యాప్తునకు తామే ఆదేశిస్తామని వార్నింగ్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మం డలం రావిర్యాల గ్రామంలోని ఫ్యాబ్‌సిటీ సెజ్ పరిధిలో సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన వంద ఎకరాలను స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ చర్యను సవాల్ చేస్తూ బెంగళూరు ఎస్బీఐ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ నగేశ్ భీమపాక గురువారం విచారించారు. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఫ్యాబ్‌సిటీ సెజ్‌లోని సర్వే నం 23/పీ, 24/పీ, 27/పీ. 28/పీ, 30/పీ, 60/పీ, 61/పీ, 63/పీ, 64/పీ, 65/పీలో సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకుంటూ 2023లో ప్రభుత్వం జీవో 9 జారీ చేసిందని చెప్పారు. సెమ్ ఇండియా తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో రికవరీ ప్రక్రియ చేపట్టామని, ఈ క్రమంలో కంపెనీకి చెందిన భూమిని స్వాధీనం చేసుకుంటూ బ్యాంకు నోటీసు జారీచేసిందని వివరించారు. రుణ రికవరీ ప్రక్రియ జరుగుతుండగా ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఈ వాదనలపై స్పందించిన హైకోర్టు రూ.200 కోట్ల ప్రాజెక్టుకు రూ.500 కోట్లు రుణం ఎలా ఇస్తారని ఎస్బీఐని నిలదీసింది. రూ.500 కోట్ల రుణం ఇవ్వలేదని, వడ్డీ, ఇతర ఖర్చులు కలిపితే అంత అయ్యిందని న్యాయవాది జవాబు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
న్యాయవాది చెప్పిన లెకల ప్రకారమే రూ.624 కోట్లని గుర్తుచేసింది. హైకోర్టు స్టే విధించిన భూమికి రుణం ఎలా మంజూరు చేస్తారని మండిపడింది. రుణం మంజూరు చేసిన బ్యాంక్ అధికారిపై కేసు పెట్టారా లేదా అని ప్రశ్నించింది. బ్యాంకు డబ్బు అంటే ప్రజలదని గుర్తుంచుకోవాలని నొకి చెప్పింది. ప్రజలు నమ్మకంతో బ్యాంకులో పెట్టిన సొమ్మును ఈ విధంగా అడ్డగోలుగా రుణాలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి భూమిని తీసుకోవడం, అదే భూమిని తాకట్టు పెడితే బ్యాంకులు ముందూ వెనుకా ఆలోచన కూడా చేయకుండా రుణాలు ఇవ్వడం ఏమిటని వాపోయింది. ఈ విధంగా రుణాలు తీసుకున్న వాళ్లు అమెరికా, ఇంగ్లండ్ వంటి విదేశాలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించింది. బ్యాంకులను దివాలా తీస్తున్న వాళ్లు బాగానే ఉంటున్నారని, బ్యాంకును నమ్మి డబ్బు దాచుకున్న వాళ్లు నష్టపోతున్నారని వ్యాఖ్యానించింది. ఉపాధి కల్పన చేస్తామని చెప్పిన కొన్ని కంపెనీలు పత్తా లేకుండా పోతున్నాయని మండిపడింది. భూకేటాయింపు లక్ష్యాలను కంపెనీలు, ఆపై బ్యాంకులు దెబ్బతీస్తున్నాయని మండిపడింది. దాతృత్వానికి మారుపేరైన శిబిచక్రవర్తిని తలదన్నేలా బ్యాంక్ అధికారి వ్యవహరించారని పేర్కొంది. బ్యాంకు కోరినట్టుగా ఏవిధమైన ఉత్తర్వులూ జారీ చేయబోమని తేల్చి చెప్పింది. కౌంటర్లు దాఖలు చేయాలని పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి, టీజీఐఐసీ వీసీ, ఎండీ, శంషాబాద్ జోనల్ మేనేజర్, సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.