హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : ఇసుకను అక్రమంగా రవాణా చేసిన ట్రాక్టర్ యజమాని జరిమానా చెల్లించిన తర్వాత కూడా ఆ వాహనాన్ని ఎందుకు విడుదల చేయలేదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. సీజ్ చేసిన వాహనాన్ని విడుదల చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని నాగర్కర్నూల్ పోలీసులు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.
జరిమానా చెల్లించినప్పటికీ ట్రాక్టర్ను విడుదల చేయలేదని ట్రాక్టర్ యజమాని బండి చెన్నయ్య దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారించారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసి పట్టుబడిన తొలిసారి రూ.5వేలు, 2వసారి రూ.15వేలు జరిమానా చెల్లించాలని జీవో స్పష్టం చేస్తున్నదని పిటిషనర్ న్యాయవాది చెప్పారు.