హైదరాబాద్, అక్టోబర్5 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన తరగతుల) రిజర్వేషన్లు అమలు చేయడం లేదంటూ బీజేపీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే కే వెంకటరమణారెడ్డి కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని అధికారులను ప్రశ్నించింది. దీనిని కోర్టు ధికరణ కింద ఎందుకు పరిగణించరాదో చెప్పాలని నోటీసులు జారీచేసింది. కోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం కోర్టుధికారమే అవుతుందని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడాన్ని ధికరణ కింద ఎందుకు పరిగణించరాదో తెలియజేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, కాళోజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సంధ్యకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.