హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి భూమి కేటాయింపును తప్పుపడుతూ పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర మంత్రి మండలి ముందున్న ఈ వ్యవహారంపై తొందరపడి ఎలా వ్యాజ్యాన్ని దాఖలు చేస్తారని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి దాఖలు చేసిన ఈ పిల్‌పై హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రస్తుతం కోకాపేటలో ఎకరం భూమి రూ.50 కోట్ల వరకు ఉన్నప్పటికీ ప్రభుత్వం రూ.3.40 కోట్ల చొప్పున బీఆర్ఎస్కు 11 ఎకరాలను రూ.37 కోట్లకే ఇచ్చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
దీనిపై అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్‌రావు స్పందిస్తూ.. ఆ భూమి ధరను పిటిషనర్ తన ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయించి చెప్పడం సరికాదని, ప్రస్తుతం ఆ భూమి కేటాయింపు వ్యవహారం మంత్రి మండలి ముందు ఉన్నదని చెప్పారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ఆ భూమి ధరను రూ.100 కోట్లుగా మంత్రి మండలి నిర్ణయిస్తే ప్రభుత్వానికి లాభమే కదా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో కనీసం జీవో కూడా వెలువడకముందే వ్యాజ్యాన్ని ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్‌ను నిలదీసింది. దీంతో జీవో వెలువడిందని, కానీ దాన్ని ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పగా.. అందుకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు గడువు కావాలని అదనపు ఏజీ కోరారు. ఆయన విజ్ఞప్తికి అనుమతి ఇచ్చిన ధర్మాసనం.. ఈ అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది.