High Court | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో చర్యలు లేకపోవడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు తాము ఆదేశాలు జారీచేసే వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా? అని అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. నెలల కాలం గడిచిపోయిందని, అయినా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ఏజీని నిలదీసింది. కోర్టు ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా? అని సందేహం వ్యక్తంచేసింది. ఇప్పటికే నెల గడిచిందని గుర్తు చేసింది. మరో మూడు నెలల వరకు కోర్టు తేల్చకపోతే అప్పటివరకు స్పీకర్ చర్యలు తీసుకోరా? అని ఏజీని నిలదీసింది.
బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి సోమవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నంత కాలం స్పీకర్ నిర్ణయం తీసుకోరా అని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇవి రాజ్యాంగపరమైన విషయాలని, వాటిని కోర్టులు దాటవేయలేవని ఏజీ జవాబు చెప్పారు. స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలు చేసిన పది రోజులకే పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు.
స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కూడా ఆగలేదని, కనీస గడువు కూడా ఇవ్వలేదని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అత్యున్నత పదవని, స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు జోక్యం చేసుకోరాదని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తుచేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక వాటిపై న్యాయ సమీక్షకు వీలుంటుందని తెలిపారు. హైకోర్టులో పిటిషన్ల కారణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ గతంలో కడియం శ్రీహరి తరఫు సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి చెప్పారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు కల్పించుకుంటూ పిటిషన్ తీసుకోవడానికే స్పీకర్ కార్యాలయం నిరాకరించిందని చెప్పారు. హైకోర్టును ఆశ్రయించాకే స్పీకర్ కార్యాలయం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్లను తీసుకుందని గుర్తు చేశారు.
నెల రోజుల తర్వాత కోర్టుకు వచ్చినట్లు చెప్పారు. స్పీకరు కోర్టులు ఆదేశాలు జారీ చేయవని, పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో పిటిషన్లను విచారణ చేస్తారని, ట్రిబ్యునల్ చైర్మని కోర్టులు ఆదేశాలు జారీ చేయవచ్చునని చెప్పారు. స్పీకర్ తన ముందున్న పార్టీ పిరాయింపుల పిటిషన్లపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా స్పీకర్ నిర్దిష్ట గడువులోగా పిటిషన్లను విచారణ పూర్తి చేసి తుది నిర్ణయం చెప్పాలన్నారు. స్పీకరు ఉత్తర్వుల జారీ చేయరాదన్న పాత తీర్పులను ఉదహరిస్తున్నారని, తాజా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్ మూడు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో హైకోర్టులు/సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చునని చెప్పారు. వాదనలు మంగళవారం కొనసాగనున్నాయి.