High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): గవర్నర్ లాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉండాలి కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. గవర్నర్ కోటాలో ఇటీవల ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అలీఖాన్ నేపథ్యం ఏమిటని నిలదీసింది.
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ సిఫారసును గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
గవర్నర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ అశోక్ నందకుమార్ వాదిస్తూ.. గవర్నర్ అంటే రబ్బ రు స్టాంపు కాదని, గవర్నర్ నిర్ణయం రాజ్యాంగానికి లోబడే ఉన్నదని అన్నారు. కోదండరాం, అలీఖాన్ అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కాదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించడంతో తదుపరి విచారణను 12కు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.