హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): పేదల నివాసాల కూల్చివేతలకు పాల్పడుతున్న హైడ్రాకు హైకోర్టు కళ్లెం వేసింది. నిషేధిత జాబితాలో పేర్కొన్న ఆస్తులేవో అధికారిక వెబ్సైట్లో పెట్టాలని, ప్రభుత్వ ఆస్తుల వివరాలను వెల్లడించాలని సూచిస్తూ హైడ్రాకు మార్గదర్శకాలు జారీచేసింది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 371బీ ప్రకారం కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీలు, వీధులు, నీటివనరులు, బహిరంగ ప్రదేశాలు, పార్కుల రక్షణకు చర్యలు చేపట్టవచ్చునని తెలిపింది. ప్రభుత్వ ఆస్తులైతే ఆ వివరాలను స్థానిక సంస్థల వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద ఆ యా ఆస్తులను నిషేధిత జాబితాలో ఉంచే ముందు హైకోర్టు డివిజన్ బెంచ్ అదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టంచేసింది.
సెక్షన్ 22ఏ పరిధిలో నిషేధిత జాబితాలో చేర్చే ముందు ఆ యా ఆస్తుల వివరాలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా హైడ్రా చర్యలు ఉంటే ఇకపై ఉపేక్షించబోమని హెచ్చరించింది. ప్రభుత్వ స్థలం అం టూ నోటీసులు ఇవ్వకుండా హైడ్రా ఏకపక్షంగా చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టంచేసింది. వివాదాస్పద స్థలాల్లో కంచె వేయడానికి వీల్లేదని తెలిపింది. జీహెచ్ఎంసీ ఆస్తుల వివరాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది.
హైదరాబాద్ గోల్కొండ మండలం గుడిమల్కాపూర్‌లో 2010లో కొనుగోలు చేసిన 1351 చదరపు గజాల స్థలానికి హైడ్రా కంచె వేయడాన్ని సవాలు చేస్తూ ప్రసాద్ తంజెర్ల వేసిన వ్యాజ్యంపై జస్టిస్ శ్రవణ్‌కుమార్ ఇటీవల విచారణ జరిపారు. కోర్టు డిక్రీ ద్వారా కొనుగోలు చేసిన స్థలాన్ని తాము కొన్నామని, కానీ అది ప్రభుత్వ స్థలం అని పేర్కొంటూ హైడ్రా ఫోన్ చేసిందని, ఆ తర్వాత రోజే వచ్చి ప్రహరీ కూల్చివేసి కంచె ఏర్పాటు చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు.
హైడ్రా న్యాయవాది ప్రతివాదన చేస్తూ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారాలతో హైడ్రాను ఏర్పాటు చేసిందని చెప్పారు. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 374(బీ) ప్రకారం కార్పొరేషన్ ఆస్తుల పరిరక్షణకు హైడ్రాకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని తెలిపారు. ఈ వాదనల తర్వాత హైకోర్టు హైడ్రాకు మార్గదర్శకాలను జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.