హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అప్పగించిన ధాన్యం ఆధారంగా పౌరసరఫరాల శాఖకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అప్పగించకపోవడంతో రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం కింద జప్తు చేసిన స్థిరాస్తులను క్రయవిక్రయాలు లేదా అన్యాక్రాంతం చేయరాదని రైస్ మిల్లర్లకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. ఆర్ఆర్ చట్టం అమలుకు ముందు మిల్లర్లకు నోటీసులు ఇచ్చిందీ లేనిదీ చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీఎంఆర్‌ను అప్పగించ ని మిల్లర్ల ఆస్తుల జప్తును రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సీఎంఆర్ కోసం మిల్లర్లకు తగినంత సమయం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్లు తనిఖీ చేసి ధాన్యా న్ని స్వాధీనం చేసుకున్నారని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి 90 కోట్లు రావాల్సి ఉన్నదని చెప్పారు. మిల్లర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ప్రతివాదన చేస్తూ..ఆర్ఆర్ యాక్ట్ కిం ద ముందుగా నోటీసులు జారీ చేయలేదని పేర్కొన్నారు. ఏజీ కల్పించుకుని మిల్లర్లకు నోటీసులు జారీ చేసిందీ లేనిదీ తెలుసుకుని చెప్పేందుకు గడువు కావాలని కోరడంతో తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
మార్గదర్శి వివరాలను ఇచ్చేందుకు ఇబ్బందేమిటి?
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): మార్గదర్శి చిట్ ఫండ్ చందాదారులకు చెల్లింపులు చేపట్టామని సుప్రీంకోర్టుకు సమర్పించిన 69,531 పేజీల వివరాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేందుకు ఉన్న ఇబ్బందులేమిటో చెప్పాలని ఆ సంస్థను హైకోర్టు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది. అందుకు గడువు కావాలని మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరడంతో విచారణ వాయిదా పడింది. నవంబర్ 4న జరిగే తదుపరి విచారణకు రిజర్వు బ్యాంకు, మార్గదర్శి ప్రతినిధులతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.