హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కార్యకర్త బీ శ్రీధర్‌రెడ్డి హత్య కేసు దర్యాప్తు డైరీని సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇందుకు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి పోలీసులకు నాలుగువారాల గడువు విధించారు. తన కుమారుడి హత్య కేసును దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారని ఆరోపిస్తూ మృతుడి తండ్రి బీ శేఖర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. గత మే 23 తెల్లవారుజామున శ్రీధర్‌రెడ్డిని పదునైన ఆయుధాలతో అతి కిరాతకంగా నరికి చంపారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ చెప్పారు.
హతునికి అధికార కాంగ్రెస్ పార్టీలో శత్రువులు ఉన్నారని తెలిపారు. మంత్రిగా కొనసాగుతున్న స్థానిక ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తెచ్చి దర్యాప్తు జరగనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తును తొకిపెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. దోషులకు సహాయం చేయడం కోసమే కేసు దర్యాప్తును మందకొడిగా చేస్తున్నారని చెప్పారు. హత్య జరిగి నెల రోజులు కావస్తున్నా పోలీసులు ఒకరిని కూడా అరెస్టు చేయలేదని అన్నారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, పోలీసులు ఏడుగురు సాక్షులను విచారించారని, నలభై మందికి పైగా సభ్యులను క్షుణ్ణంగా ప్రశ్నించారని చెప్పారు. పోలీసుల దర్యాప్తు న్యాయమైన రీతిలోనే ఉందని, దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు, పిటిషన్లో పేరొన్న అంశాలను పరిశీలించి, పిటిషనర్ ఆందోళనను పరిగణనలోకి తీసుకుని కేసు డైరీని నాలుగు వారాల్లోగా సమర్పించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. అప్పటివరకు విచారణను వాయిదా వేసింది.
2 నెలల్లో మానవ హకుల కమిషన్
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మానవ హకుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామక ప్రక్రియను రెండు నెలల్లో పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్, సభ్యులను నియమించకపోవడాన్ని సవాల్ చేస్తూ అద్నాన్ మహమ్మద్ గత ఏడాది వేసిన పిల్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మానవ హకుల కమిషన్‌కు చైర్మన్, జ్యుడీషియల్ సభ్యులు, సాంకేతిక సభ్యుల నియామకానికి మార్చి 10న నోటిఫికేషన్ వెలువడిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తికి రెండు మాసాల గడువు కావాలని చెప్పారు. దీంతో విచారణ 8 వారాలకు వాయిదా పడింది.