Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. నిర్ణీత గడువులోగా హెచ్ఎండీఏ పరిధిలో చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల నిర్ధారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆక్షింతలు వేయగా, గడువు దగ్గర పడుతుండటంతో నెపాన్ని కప్పిపుచ్చుకునేలా గత ప్రభుత్వ వైఫల్యం అంటూ సన్నాయి నొక్కులతో కాలయాపన చేస్తున్నది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మొత్తం చెరువుల జాబితా, వాటి ఎఫ్టీఎల్, బఫర్జోన్లతోపాటు, హద్దురాళ్లను నిర్దేశిస్తూ నవంబర్‌లోగా తుది నోటిఫికేషన్ జారీచేసిన నివేదికతో రావాలంటూ హెచ్ఎండీఏ కమిషనర్‌ను ఆగస్టులో కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఎఫ్టీఎల్ నిర్ధారణ, తుది నోటిఫికేషన్‌పై దృష్టిపెట్టని హెచ్ఎండీఏ యంత్రాం గం.. గత ప్రభుత్వ వైఫల్యంతోనే పూర్తి కాలేదని దుష్ప్రచారం చేయడం విడ్డూరం. చెరువుల పరిరక్షణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ సర్కారు మిషన్ కాకతీయ పేరిట చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషిచేసింది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల ఆధునీకరణకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) రూపొందించిన టెక్నాలజీ సాయంతో హద్దురాళ్లను నిర్ధారించేలా కీలక నిర్ణయం తీసుకున్నది. చెరువుల ప్రాథమిక, తుది నోటిఫికేషన్ వేగవంతం చేయటంలో ఎల్పీసీ సమావేశాల్లో అధికారులను పరుగులు పెట్టించింది.
కానీ ఇరిగేషన్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం, 2010 కంటే ముందే అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు సంబంధిత చెరువుల రికార్డులను నిర్వీర్యం చేయటంతో తుదిజాబితా జాప్యానికి కారణమైంది. కానీ ఉద్దేశపూర్వకంగా చెరువుల హద్దురాళ్లను బీఆర్ఎస్ సర్కారు ఖరారు చేయలేదంటూ సంబంధిత శాఖలతో బురద జల్లే ప్రయత్నానికి కాంగ్రెస్ పూనుకొన్నది. హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణకు ఉమ్మడి రాష్ట్రంలో 2010లో ఏర్పాటు చేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ (ఎల్పీసీ) అప్పటికే ఉన్న చెరువుల తుదిజాబితాను ఎందుకు పూర్తి చేయలేకపోయిందనేది ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తున్నది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే నగరంలోని ప్రధాన చెరువులు, కుంటలను అన్యాక్రాంతం చేయటంలో అప్పటి కాంగ్రెస్, టీడీపీ కంకణం కట్టుకుని దశలవారీగా లేక్ సిటీ మూలాలను తొలగించే కార్యకలాపాలను ప్రోత్సహించాయి. దీంతో 2013 నాటికి రూపొందించిన ‘మాస్టర్ ప్లాన్-2031’లో వందల చెరువుల జాడ లేకపోవడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. దీనికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పన బాధ్యతలను ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించటంలోనే అస లు మతలబు ఉన్నదని, దీంతోనే విలువైన చెరువులు, కుంటలు కాలగర్భంలో కలిసిపోవడానికి ప్రధాన కారణమని పెద్దఎత్తున కథనాలు వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ఎంతోమంది పర్యావరణవేత్తలు గొంతెత్తారు. చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ చెరువుల నిర్వీర్యానికి కారణాలను దాచిపెట్టే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో 3,532కిపైగా చెరువులు, కుంట లు ఉన్నాయి. వీటి పర్యవేక్షణ, నిర్వహణ, పరిరక్షణ, ఆధునీకరణ కార్యకలాపాలన్నీ హెచ్ఎండీఏవే. చెరువు హద్దులను కాపాడటం కూడా దాని బాధ్యతే. 2013 నుంచి 2023 నాటికి 2,525 చెరువులకు ప్రాథమిక హద్దురాళ్ల ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వాటిలో 230 చెరువులకు మాత్రమే బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారణ జరిగినట్టు తేలింది. బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ ఎందుకు ఖరారు చేయాలని హెచ్ఎండీఏను ప్రశ్నించిన హైకోర్టు.. నవంబర్‌లోగా మిగిలిన 1,000 చెరువులకు హద్దుల నిర్ధారణకు ఆగస్టులో ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఆ దిశగా అడుగులే వేయలేదు. ఆక్రమణల లెక్కలనూ వెలికి తీయలేకపోయారు. నెల గడువులోగా తుది జాబితా తయారవడం అసాధ్యంగా మారవటంతో ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు గత ప్రభుత్వంపై రాళ్లు వేయటం మొదలుపెట్టింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ నిర్ధారణను బీఆర్ఎస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే చేయలేదంటూ అసత్య ప్రచారానికి తెరలేపింది.
హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపడుతున్నది. కానీ ఉమ్మడి పాలనలో మాస్టర్ ప్లాన్-2031లోనే వందల చెరువులను లేకుండా చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పట్లోనే దీనిపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తుది మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న చెరువులు, కుంటలు మాయమయ్యాయి. సైబరాబాద్ పరిధిలో 10సంఖ్యలో హద్దురాళ్లు, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ విషయం లో చెరువుల నోటిఫికేషన్‌ను తారుమారు చేసి న ఆర్వీ కన్సల్టెన్సీ సమగ్రంగా విచారించకుం డా మాస్టర్‌ప్లాన్ చేసిందనే ఆరోపణలున్నాయి. వందల చెరువుల వెంటభారీ భవంతులు వెలిశాయని జలవనరుల నిపుణులు తెలిపారు.
2010లో లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటుచేసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలి సమావేశంలో 21 చెరువుల డిమార్కేషన్, హద్దురాళ్ల నిర్ధారణ, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ నిర్ధారణ చేపట్టాలని భావించింది. ఆ జాబి తా ప్రకారం ఉస్మాన్‌సాగర్, హిమయత్సాగర్ వెంబడి గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ నిర్ధారణ కాక యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, పీసీబీ, మైనర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్, అటవీ, కలెక్టర్లు, టౌన్‌ప్లానింగ్, పర్యావరణవేత్తలు వంటి 18 సభ్యులతో ఏర్పాటైన నూతన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఎల్పీసీ సమావేశంలోనే సాధకబాధకాలపై చర్చించారు. సమన్వయం లేకపోతే మాస్టర్‌ప్లాన్, లేక్ పరిరక్షణ సాధ్యం కాదని ఆర్వీ కన్సల్టెన్సీ కుండబద్ధలు కొట్టినట్టు తెలిసింది. కానీ అధికారులు తూతూమంత్రంగా ఎల్పీసీ సమావేశాలు నిర్వహించి చేతులెత్తేశారు. దీంతో నగరంలో చెరువుల హద్దురాళ్ల నిర్ధారణ జాప్యానికి బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీగా ముద్ర పడింది.
మరో నెలలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల తుదిజాబితా ప్రక్రియ పూర్తి చేయాలన్న గడువు ముంచుకొస్తున్నది. నవంబర్ నాటికి తుదిజాబితాతో నివేదికను అందజేయాల్సి ఉండగా.. చెరువుల నిర్ధారణ చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎల్పీసీ తొలి సమావేశంలోనే ఇబ్బందులపై చర్చించగా, అప్పటి సమావేశానికి రంగారెడ్డి కలెక్టర్ హోదాలో ప్రస్తుత మున్సిపల్ శాఖ సెక్రటరీ కూడా హాజరయ్యారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణలో సమస్యలను పరిష్కరించి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా.. ఆ పని చేయలేక ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పబ్బం గడుపుతున్నదని హైదరాబాద్‌లోని జలవనరుల నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.