హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో 3.7 ఎకరాల భూమిని కేటాయించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు కన్నెర్ర జేసింది. ఇప్పటికే పలుసార్లు ఆదేశించినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కౌంటరు దాఖలుచేసే వరకు రోజుకు రూ.వెయ్యి చొప్పున జరిమానా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మొత్తాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని స్పష్టం చేసింది. ఆ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 20కి వాయిదా వేసింది. ఆ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
‘హౌసింగ్ సొసైటీ’ అవకతవకలపై నివేదిక ఏదీ? ; సహకార సంఘాల రిజిస్ట్రార్‌పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గం అవకతవకలపై విచారణ నివేదికను అందజేయాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో సెప్టెంబర్ 27న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని రాష్ట్ర సహకార సంఘాల శాఖ రిజిస్ట్రార్ కే హరితను ఆదేశిస్తూ జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కోర్టు ధికరణ కింద మీపై ఎందుకు చర్యలు చేపట్టరాదో చెప్పాలంటూ ఆ ఉత్తర్వుల్లో హరితను ప్రశ్నించారు.
5,748 స్కూళ్లల్లో సెల్ఫ్ డిఫెన్స్
హైదరాబాద్, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): సర్కారీ స్కూళ్లలోని బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 5,748 బడుల్లో సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను అమలుచేయనున్నారు. 3 మాసాలపాటు అందించే శిక్షణ ఈ నెల నుంచి ప్రారంభంకానుంది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శిక్షణ కొనసాగుతుంది. మార్గదర్శకాలతోపాటు, రూ.7.32 కోట్ల నిధులను విద్యాశాఖ అధికారులు మంజూరుచేశారు. మార్షల్ ఆర్ట్స్‌తోపాటు, సెల్ఫ్ డిఫెన్స్, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతపై బాలికలకు ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. కుంగ్ ఫూ, కరాటే, జూడో లాంటి మార్షల్ ఆర్ట్స్‌లోని ముఖ్యమైన సెల్ఫ్ డిఫెన్స్ చిట్కాలపై శిక్షణ ఉంటుంది.