Group-1 Mains | హైదరాబాద్, మే 2, (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ గ్రూప్-1లో ఒక పద్ధతి ప్రకారం తప్పు తర్వాత మరో తప్పు జరిగిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ఒక తప్పు, ఒక పొరపాటు అయితే ఎవరైనా ఉపేక్షిస్తారని, కానీ ఒకదాని తర్వాత మరో తప్పు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన పరీక్షల్లో అక్రమాలు జరిగితే కోర్టు రద్దు చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గ్రూప్-1 పరీక్షల్లోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని తెలిపారు. మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. వాదనలు పూర్తికాకపోవడంతో విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేశా రు. సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవచ్చని, కానీ నియామకపత్రాలు జారీ చేయరాదంటూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్వర్వులు కొనసాగుతాయని కోర్టు స్పష్టంచేసింది. పునర్ మూల్యాంకనం కోరితే మార్కులు తగ్గిపోయాయని ఒకవైపు, మార్కుల జాబితాను ఫోర్జరీ చేశారంటూ మరోవైపు వాదప్రతివాదులు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రాలను సమర్పించాలని టీజీపీఎస్సీకి నోటీసులు జారీచేసింది. ప్రతివాదిగా చేర్చినందున పూజితారెడ్డికి నోటీసులు జారీచేస్తున్నట్టు తెలిపింది.
టీజీపీఎస్సీ సమర్థన దారుణం
దేశంలో ఎక్కడైనా ఒక పరీక్షకు ఒకే హాల్ టికెట్ ఉంటుందని, కానీ తొలిసారి గ్రూప్-1 పరీక్షలకు రెండు హాల్‌టికెట్లు ఇవ్వడమే కాకుండా, ఈ చర్యను టీజీపీఎస్సీ సమర్థించుకోవడం దారుణమని రచనారెడ్డి వాదించారు. హాల్‌టికెట్ నంబర్ల మార్పు నుంచి కేంద్రాల ఎంపిక, ఎవాల్యుయేటర్ల నియామకం వంటివి చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అన్నారు. గ్రూప్-1 మెయిన్ పరీక్ష రాసిన సంఖ్య మొదట ప్రకటించిన దానికి, తర్వాత వెల్లడించిన దానికి మధ్య 1000 మంది తేడా ఉందంటే ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నారని టీజీపీఎస్సీ చెప్తున్న వ్యక్తి ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ అక్కడి నుంచి వేతనం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. దాదాపు 40 శాతం మంది తెలుగులో, 10 నుంచి 12శాతం మంది ఉర్దూలో, మిగిలిన వారు ఇంగ్లిష్‌లో పరీక్ష రాశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మూల్యాంకనం కోసం నియమించిన వారిలో తెలుగు ఎంతమందికి వచ్చన్న విషయాన్ని సర్వీస్ కమిషన్ వెల్లడించలేదని తెలిపారు. వ్యాల్యుయేషన్ చేసే వారికి తెలుగు వస్తే సరిపోదని, తెలుగుపై పూర్తి ఆధిపత్యం ఉండాలని చెప్పారు. తెలుగు వారికే మారులు ఎందుకు తకువ వస్తున్నాయో తేల్చాలని కోరారు.
సీల్డ్ కవర్లో జవాబు పత్రాలు
టీజీపీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ తదుపరి విచారణ నాటికి మారుల జాబితాను, జవాబు పత్రాలను సీల్డ్ కవర్లో సమర్పిస్తామని చెప్పారు. వాటిని పరిశీలిస్తే పిటిషనర్ల అనుమానాలకు తెరపడుతుందన్నారు. ఫోర్జరీ మారుల జాబితా సమర్పించారని స్పష్టమైనందున కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా కేసును కొట్టివేయాలని కోరారు. గతంలో ఇలాగే, ఇదే హైకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. పిటిషన్లపై విచారణను కావాలని కాలయాపన చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాది రచనారెడ్డి జోక్యం చేసుకుంటూ వాదనలు హడావుడిగా పూర్తిచేస్తే అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుంటూ ఇది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన వ్యవహారమని హితువు పలికింది.
పేరు తొలగించాలని విన్నపం
గ్రూప్-1 మెయిన్ పరీక్షల్లో ఓ అభ్యర్థికి రీకౌంటింగ్‌లో తకువ మారులొచ్చాయని తప్పుడు మెమో పెట్టిన వ్యవహారంలో తనపై విచారణ ఉపసంహరించాలని సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న షబ్నం ఆర్య హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
మూడో మూల్యాంకనం
కోఠి మహిళా కళాశాలలోని 18వ సెంటర్లో 721 మంది మెయిన్స్ పరీక్ష రాస్తే 39 మంది, అదే కళాశాలోని 19వ సెంటర్లో 776 మంది పరీక్ష రాస్తే వారిలో 32 మంది ఎంపికయ్యారని రచనారెడ్డి వివరించారు. మొత్తం 563 మందిలో సుమారు 12శాతం మెయిన్స్‌కు అర్హత పొందడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. రెండుసార్లు జరిపిన మూల్యాంకనంలో 15శాతం తేడా ఉంటే మూడో మూల్యాంకనం జరుగుతుందని నిబంధనల్లో ఉన్నదని గుర్తుచేశారు.