హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : గేటెడ్ కమ్యూనిటీల నిర్వహణకు మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ అపార్ట్మెంట్స్ యాక్ట్ కింద గేటెడ్ కమ్యూనిటీలను నిర్వహిస్తున్నప్పటికీ వాటిలో అక్రమ కార్యకలాపాల నియంత్రణకు వీలుకావడం లేదని పేర్కొన్నది. గేటెడ్ కమ్యూనిటీల్లో అసాంఘిక, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం పోలీసులకు ఉన్నదని తేల్చిచెప్పింది. హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్ విల్లాల కమ్యూనిటీలో అక్రమంగా పేకాట, మద్యపానం, మత్తు పదార్థాల వినియోగం, లైంగిక కార్యకలాపాలు జరుగుతుండటంపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల విచారణ జరిపారు.
ఆ గేటెడ్ కమ్యూనిటీలో ముగ్గురు సభ్యులతో ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని, అందులో సీనియర్ సిటిజన్లు, మహిళలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చోటు కల్పించాలని ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్‌ను ఆదేశించారు. గేటెడ్ కమ్యూనిటీల్లో అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఏమేమి చేయాలో, ఏమేమి చేయకూడదో స్పష్టంచేస్తూ తగిన సలహాలు, సూచనలతో ఫ్లాట్ ఓనర్ల అసోసియేషన్లకు మార్గదర్శకాలను జారీ చేయాలని పోలీసు కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. గేటెడ్ కమ్యూనిటీల్లో నేరాలు, న్యూసెన్స్ కేసులపై ఏవైనా ఫిర్యాదులు అందితే వెంటనే చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ స్టేషన్లతోపాటు టాస్‌ఫోర్స్, టీఎన్సీబీకి తగిన ఆదేశాలు ఇవ్వాలని పోలీస్ కమిషనర్‌కు స్పష్టం చేశారు. సాధ్యమైతే కమ్యూనిటీల్లో ఫిర్యాదుల స్వీకరణకు ఓ యాప్‌ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని, ఆ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే బాధితుల వివరాలు గోప్యంగా ఉండేలా చూడాలని సూచించారు.