హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో పరిపాలనా వ్యవహారాలు, నిర్వహణ, ఆర్థిక అవకతవకలపై సీబీసీఐడీ విభాగంలోని సిట్‌తో దర్యాప్తు జరిపించాలని హైకోర్టు ఆదేశించింది. ఐపీఎస్ హోదాలోని అదనపు పోలీసు కమిషనర్ సిట్‌కు నేతృత్వం వహించాలని తెలిపింది. హెచ్‌సీఏ కార్యకలాపాలపై కేసు నమోదు చేసి పరిపాలన, నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని శుక్రవారం ఆదేశించింది. ప్రస్తుత కమిటీ అందుబాటులో ఉన్న రికార్డులను, జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ జీవీ సీతాపతి, జస్టిస్ నిసార్‌అహ్మద్ కక్రూ, జస్టిస్ నవీన్‌రావు ఇచ్చిన నివేదికలతో సహా అన్ని రికార్డులను సిట్ స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది. రాష్ట్ర ఏజన్సీలు, హెచ్‌సీఏ కార్యనిర్వాహకులు, అధికారులు, ఉద్యోగులు సిట్‌కు సహకరించి, అవసరమైన సమాచారం అందజేయాలని ఆదేశించారు.
అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ ఏకసభ్య కమిటీ జస్టిస్ పీ నవీన్‌రావు నేతృత్వంలో పనిచేయాలని ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐ స్వాధీనం చేసుకోవాలని, ఆర్థిక అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, 2025లో జరిగిన సమావేశాన్ని రద్దు చేయాలని కోరుతూ సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దీనిపై విచారించిన జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం తీర్పు వెలువరిస్తూ హెచ్‌సీఏలో గత కొన్నేండ్లుగా జరుగుతున్న అవకతవకలకు ఒక తారిక ముగింపునివ్వాల్సిన అవసరం ఉందని, ఈ వ్యవహారాలపై సీఐడీతో ప్రత్యేక దర్యాప్తు అవసరమని భావిస్తున్నామని చెప్పారు. దర్యాప్తునకు ఆదేశించినంత మాత్రాన తప్పు చేశారనిగానీ, చేయలేదనిగానీ ఎలాంటి అభిప్రాయాన్ని ఈ కోర్టు వ్యక్తం చేయడంలేదని స్పష్టంచేశారు. ఇది అనుమానాలను నివృత్తి చేసి చట్టబద్ధ వ్యవస్థగా కొనసాగించడానికి చేపట్టే ఒక విధానపరమైన అడుగుగా పేరొన్నారు. క్రికెట్‌కు సంబంధించిన విషయాలు లీగ్ మ్యాచ్‌ల నిర్వహణ, ఆటగాళ్ల ఎంపికలో అక్రమాలపై ఆరోపణలున్న నేపథ్యంలో 2024-25, 2025-26 క్రికెట్ లీగ్ మ్యాచ్‌ల నిర్వహణను పర్యవేక్షించడానికి జస్టిస్ నవీన్‌రావును ఈ కోర్టు నియమించిందని తెలిపారు.
ఆయన హయాంలో 1500కు పైగా మ్యాచ్‌లు జరిగాయని, వివిధ టోర్నమెంట్లలో జట్ల ప్రదర్శన గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం రెండు టైటిళ్లను గెలుపొందిందని తెలిపారు. ఏకసభ్య కమిటీ నియామకం ఫలితాన్నిచ్చిందని, ఆయనకు స్వేచ్ఛ కల్పించినట్లయితే క్రికెట్ ప్రమాణాలు మెరుగుపడడం కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. దుర్వినియోగాలను అడ్డుకోవడానికి వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉన్నదని, అందువల్ల దర్యాప్తు పూర్తయి, కోర్టు నిర్ణయం వెలువరించేదాకా అపెక్స్ కౌన్సిల్ ద్వారా క్రికెట్ వ్యవహారాలు జస్టిస్ నవీన్‌రావు పర్యవేక్షణలో కొనసాగాలని ఆదేశించారు. క్రికెట్‌కు సంబంధించి అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఏకసభ్య కమిటీకి పూర్తి అధికారం ఉన్నదని తేల్చి చెప్పారు. అన్ని స్థాయిల్లో, క్యాటగిరీల్లో మెన్, ఉమెన్ లీగ్ నిర్వహణ, రాష్ట్ర, జోనల్, ఇతర జట్ల ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియను క్రమబద్ధీకరించడం, కోచ్‌లు, సెలెక్టర్లు, సపోర్టు సిబ్బంది, సాంకేతిక సిబ్బంది, అన్నింటిపై జస్టిస్ నవీన్‌రావు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏకసభ్య కమిటీ సభ్యులుగా జస్టిస్ నవీన్‌రావుకు రూ.5 లక్షల వేతనం చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలురించారు.