హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట శాసనసభ్యుడు టీ హరీశ్‌రావుపై నమోదైన కేసులో ఆయనను ఫిబ్రవరి 5వ తేదీ వరకు అరెస్టు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీచేసిన ఉత్తర్వులను మంగళవారం జస్టిస్ కే లక్ష్మణ్ మరోసారి పొడిగించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పీఎస్‌లో తనపై నమోదైన ఫోన్‌ట్యాపింగ్ కేసును కొట్టివేయాలంటూ హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ లక్ష్మణ్ విచారణ చేపట్టారు. గతంలో ఏసీపీ వేసిన కౌంటర్ పిటిషన్‌పై హరీశ్‌రావు అఫిడవిట్ దాఖలు చేయగా, దానిపై వాదనలు వినిపించడానికి కొంత గడువు కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరావు కోరారు. ఇందుకు అనుమతించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశారు.
రాజకీయ లబ్ధి కోసమే చక్రధర్‌గౌడ్ తనపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని హరీశ్‌రావు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయించానంటూ తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపారు. తన రాజకీయ ప్రత్యర్థుల అండతో వ్యక్తిగతంగా లబ్ధి పొందాలనే కుట్రతోనే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. చక్రధర్‌గౌడ్‌పై లైంగికదాడి, కిడ్నాప్వంటి కేసుల్లో ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని వేలమందిని మోసం చేశాడని తెలిపారు. ఆయనపై ఏకంగా 11 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అక్రమార్జనతో రాజకీయంగా ఎదగాలన్న ఆయన కుటిల ప్రయత్నాలను ప్రజలు తిరసరించారని తెలిపారు. చక్రధర్ తొలుత బీజేపీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డాడని, ఆ తర్వాత బీఎస్పీలో చేరి తనపై సద్దిపేట నుంచి పోటీచేశారని పేర్కొన్నారు. అయితే ప్రజలు ఆయనను చిత్తుగా ఓడించారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, చక్రధర్ ఆ పార్టీలో చేరి సీఎం రేవంత్‌రెడ్డి అండదండలతో తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని వివరించారు. సీఎం అండతోనే తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి లేనిపోని అభియోగాలతో కేసు నమోదు చేశాడని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే కేసు నమోదు చేశారని తెలిపారు. ఆధారాలు లేకుండా పెట్టిన కేసును కొట్టివేయాలని కోరారు.