Supreme Court : మహిళ ఒంటిపైనున్న దుస్తులను లాగటం, ఆమె చెస్ట్పై తాకడం అత్యాచారమే అవుతుందని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టంచేసింది. మహిళ దుస్తులు లాగడం, చెస్ట్పై తాకడం అత్యాచారం కిందకు రాదంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) ఇచ్చిన తీర్పు తీవ్ర దుమారం రేపింది. దాంతో ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది. నిందితులకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.
కాగా, 2021 నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన 11 ఏళ్ల (ఘటన జరిగే నాటికి) కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వారిని సమీపించి బాలికను ఇంటి దగ్గర దింపుతామని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. మార్గమధ్యలో ఆమెను ఓ కల్వర్టు కిందకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆమెను అసభ్యంగా తాకారు. దుస్తులు లాగారు.
దాంతో బాలిక అరుపులు విని చట్టుపక్కల వాళ్లు అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. మహిళ చెస్ట్పై తాకినంత మాత్రాన, దుస్తులు పట్టుకొని లాగినంత మాత్రాన దాన్ని అత్యాచార నేరంగా పరిగణించలేమంటూ కేసును కొట్టివేసింది. ఈ తీర్పుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇలాంటి తీర్పులతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. దాంతో కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏమాత్రం సున్నితమైనవి కావని, అమానవీయంగా ఉన్నాయని విచారం వ్యక్తంచేసింది. దీనిపై కేంద్ర సర్కారు, ఉత్తరప్రదేశ్ సర్కారు స్పందనలు తెలుసుకుని తాజా తీర్పు వెలువరించింది.