హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల్లోని గ్రామ, జిల్లాల ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సహకార సంఘ ఎన్నికల మండలిని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబరు 23న ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి నాలుగు వారాల్లో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.
గడువు తీరినప్పటికీ ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదంటూ ముత్రాసి/ముదిరాజ్ తెగకు చెందిన బీ మల్లేశం సహా ఎనిమిది మంది వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారించారు. ఐదేండ్ల గడువు ముగిసిన తర్వాత 12 జిల్లాల్లోనే ఎన్నికలు నిర్వహించారని, మిగిలిన 21 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు.