HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో/మాదాపూర్, జనవరి 5(నమస్తే తెలంగాణ) : మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా బాహుబలి బుల్డోజర్ హల్చల్ చేసింది. సొసైటీలోని ఏడంతస్తుల భవనాన్ని ఆదివారం కూల్చేసింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సర్వే నంబర్ 11/5లో ప్లాట్ నంబర్ 5/13 పేరిట 684 గజాల స్థలంలో 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని చేపట్టిన ఏడంతస్తుల (సెల్లార్ నుంచి జీ ప్లస్ 5) భవనాన్ని హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు నేలమట్టం చేయించారు.
జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను ఖాతరుచేయకుండా సెల్లార్, గ్రౌండ్‌ఫ్లోర్ సహా ఏడంతస్తులు నిర్మించడంపై స్థానికుల ఫిర్యాదు మేరకు కూల్చివేసినట్టు హైడ్రా అధికారులు తెలిపారు. కూల్చివేత నేపథ్యంలో భవనం వద్ద భారీగా పోలీసులు, హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. శనివారమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక అధికారులతో కలిసి భవనాన్ని పరిశీలించారు. ఎలాంటి సెట్ బ్యాక్ వదలకుండా, పార్కింగ్ సౌకర్యం, ఫైర్‌సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకుండా సెల్లార్లోనే కిచెన్ నిర్మాణానికి ఏర్పాట్లు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు.
భవన యజమానులు ఎవరి ఉత్తర్వులనూ లెక్కచేయకుండా అక్రమంగా నిర్మిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే భవనాన్ని కూల్చేయాలని జీహెచ్ఎంసీతోపాటు కలిసి హైడ్రా బృందాన్ని ఆదేశించారు. దీంతో హైడ్రా బృందం ఆదివారం ఉదయమే అయ్యప్ప సొసైటీకి చేరుకొని మొదట సాధారణ క్రేన్‌తో కూల్చివేతలు ప్రారంభించింది. మధ్యాహ్నం సమయంలో బాహుబలి బుల్డోజర్ వచ్చి నేలమట్టం చేసింది. కాగా ఎలాంటి అనుమతులు లేకుండా భవనం మొదలుపెట్టి ఏడంతస్థులు పూర్తి చేసేదాకా జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయ్యప్ప సొసైటీలో చాలావరకు అక్రమకట్టడాలే ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వాటిపై జీహెచ్ఎంసీ కమిషనర్‌తో సమీక్షిస్తామని, కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలుంటే వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయ్యప్ప సొసైటీలో వందల మంది విద్యార్థులు, ఉద్యోగులు పలు అక్రమకట్టడాల్లో నివసిస్తున్నారని, ఆయా భవనాలకు ఫైర్‌సేఫ్టీ, నిర్మాణ అనుమతులు లేవని వివరించారు. అక్రమ నిర్మాణాలతో మురుగునీటి వ్యవస్థ కూడా బాగా దెబ్బతిన్నదని, మలమూత్రాలు రోడ్డుపైకి వస్తున్నట్టు స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని, సహకరించిన అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి రిపోర్ట్ పంపుతామని వెల్లడించారు.