హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) వెంట న్యాయవాదిని అనుమతించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించాలని ఏసీబీని ఆదేశించింది. కేటీఆర్‌ను విచారించే ఏసీబీ కార్యాలయంలో దర్యాప్తు గదికి పకనే ఉన్న గ్రంథాలయ గదిలో న్యాయవాది ఉండేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలన్న ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించలేదు. గురువారం జరిగే విచారణ తీరును బట్టి అవసరమైతే పిటిషనర్ మళ్లీ కోర్టుకు రావచ్చని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 6 న ఏసీబీ దర్యాప్తుకు న్యాయవాదిని వెంటబెట్టుకుని వెళ్తే పోలీసులు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై బుధవారం భోజన విరామ సమయంలో హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది.
కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రభాకర్‌రావు వాదన వినిపిస్తూ.. ఏసీబీ విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. అందుకు జస్టిస్ లక్ష్మణ్ నిరాకరిస్తూ.. విచారణను న్యాయవాది సమక్షంలో జరిపించాలో లేక విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయించాలో తేల్చుకోవాలని, ఈ రెండింటిలో ఒక్క వెసులుబాటు మాత్రమే కల్పించగలమని స్పష్టం చేశారు. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి కేసులో ఈ రెండు వెసులుబాట్లు కల్పించారని ప్రభాకర్‌రావు గుర్తు చేయడంతో.. అవినాశ్‌రెడ్డి కేసును ఐపీఎస్ అధికారి దర్యాప్తు చేశారని, అవినాశ్‌రెడ్డి స్టేట్మెంట్ను డిలీట్ చేశారని, లేని విషయాలను చేర్చారని తీవ్ర అభియోగాలు రావడంతోనే ఆ వెసులుబాట్లు కల్పించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ నెల 9న కేటీఆర్ ఏసీబీ దర్యాప్తునకు వెళ్లాక ఏమైనా సందేహాలుంటే తిరిగి 10న హైకోర్టుకు రావచ్చని, అప్పటి వరకు పిటిషన్‌ను మనుగడలోనే ఉంచుతామని చెప్పారు. విచారణకు కేటీఆర్ వెంట వెళ్లేందుకు ఒక్క న్యాయవాదిని మాత్రమే అనుమతిస్తామని, అందుకోసం ముగ్గురు లేదా ఐదుగురు లాయర్ల పేర్లు ఇవ్వాలని న్యాయమూర్తి చెప్పడంతో.. సీనియర్ న్యాయవాది జే రామచందర్‌రావు (మాజీ అదనపు అడ్వకేట్ జనరల్) ఒకరి పేరునే ఇస్తున్నట్టు ప్రభాకర్‌రావు తెలిపారు. దీంతో ఏసీబీ విచారణ సమయంలో కేటీఆర్‌ను తన న్యాయవాదికి కనబడేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన జస్టిస్ లక్ష్మణ్.. కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చేటప్పుడు గానీ, ఆయనను దర్యాప్తు అధికారి ప్రశ్నించేటప్పుడు గానీ న్యాయవాది జోక్యం చేసుకోడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. ఏసీబీ ఆఫీసులో దర్యాప్తు గదికి ఆనుకుని ఉన్న మరో గదిలో న్యాయవాది ఉంటే గాజు అద్దం కిటికీ ద్వారా కేటీఆర్‌ను చూసేందుకు వీలుంటుందని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతిస్తున్నందున విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేందుకు అనుమతించడ లేదని తెలిపారు. కేటీఆర్‌ను విచారించేటప్పుడు ఆ గదికి పకనే ఉన్న గ్రంథాలయంలో న్యాయవాది ఉండేలా చర్యలు చేపట్టాలని ఏసీబీని ఆదేశించారు. కేటీఆర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని సందేహించనక్కర్లేదని, స్టేట్మెంట్ నమోదుపై పిటిషనర్ అనుమానం వ్యక్తం చేస్తున్నందున ఆయన కంటికి కనిపించేంత దూరంలో న్యాయవాది ఉండేందుకు అనుమతిస్తున్నామని జస్టిస్ కే లక్ష్మణ్ వివరించారు. అయినప్పటికీ ఏసీబీ దర్యాప్తు ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కేటీఆర్ తరఫు న్యాయవాదులు ప్రభాకర్‌రావు, టీవీ రమణారావు మరోసారి కోరారు. లగచర్ల కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని ప్రశ్నించినప్పుడు పోలీసులు తప్పుడు విధానాన్ని అనుసరించడం వల్లే ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ నెల 9న ఏసీబీ జరిపే విచారణ తీరు, స్టేట్మెంట్ నమోదుపై పిటిషనర్‌కు ఏమైనా అనుమానాలుంటే తిరిగి 10న కోర్టును ఆశ్రయించవచ్చని, అప్పటి వరకు పిటిషన్‌ను మనుగడలో ఉంచుతామని స్పష్టం చేశారు.
ఏసీబీ విచారణ కోసం ఈ నెల 6న న్యాయవాదితో కలిసి వెళ్తే పోలీసులు అనుమతించలేదని, ఇది రాజ్యాంగంలోని 21, 22 అధికరణలకు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకమని పేరొంటూ హైకోర్టులో కేటీఆర్ 8 పేజీల లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ పిటిషన్ వివరాలు ఇవీ..
‘ఫార్ములా ఈ-కార్ రేసుపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టం-1988లోని 13(1)(ఏ), 13 (2) సెక్షన్లతోపాటు ఐపీసీలోని 409, 120ఏ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ కేసు విచారణకు హాజరయ్యేందుకు సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన నా వెంట న్యాయవాదిని అనుమతించలేదు. ఏసీబీ విచారణలో నేను చెప్పిన విషయాలను పోలీసులు తప్పుగా నమోదు చేసే అవకాశం ఉన్నందున నాతోపాటు న్యాయవాదిని వెంట తీసుకెళ్లేందుకు అనుమతించాలని కోరినప్పటికీ పోలీసులు ఒప్పుకోలేదు. ఈ కేసు దర్యాప్తునకు నేను సహకరిస్తున్నప్పటికీ పోలీసులు నా వెంట న్యాయవాదిని రానీయకుండా అడ్డుకున్నారు. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరయ్యేందుకు నేను సిద్ధంగానే ఉన్నా. కానీ, విచారణ సందర్భంగా నేను ఇచ్చే వాంగ్మూలంలో దర్యాప్తు అధికారి మార్పులు చేర్పులు చేసే అవకాశాలున్నాయి. పోలీసులు నా రాజకీయ జీవితంతో ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కేసులు నమోదు చేయించేందుకు అధికార పార్టీ పెద్దలు పోలీసులను ఒత్తిడి చేస్తున్నారు. అధికార పార్టీని సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతుంటే జీర్ణించుకోలేక అధికార పార్టీ నేతలు నాపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు బనాయించారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పాలకులను నిలదీయడంతోపాటు అధికార పార్టీ నాయకుల అకృత్యాలను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుండటం వల్లే ఇలాంటి కేసులను నమోదు చేసి ఇబ్పందులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అకృత్యాలను బహిర్గతం చేయకుండా నిరోధించేందుకే నాపై తప్పుడు కేసులు పెట్టారు. నిరుడు లగచర్ల ఘటనపై నమోదైన కేసులో బొంరాస్‌పేట పోలీసులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేసి, తప్పుడు స్టేట్మెంట్ నమోదు చేశారు. అధికార పార్టీ సీనియర్ నాయకుల ఆదేశాల మేరకే అలా జరిగింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే. పాడికౌశిక్రెడ్డిపై నమోదైన కేసులో బంజారాహిల్స్ పోలీసులు కూడా ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడు నా విషయంలో ఏసీబీ అధికారులు కూడా అదేవిధంగా చేస్తారన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. తద్వారా నా ప్రతిష్టను దిగజార్చేందుకు, రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతున్నది. దీన్ని అడ్డుకోవాలి. ఏసీబీ విచారణ సమయంలో నాతోపాటు న్యాయవాదిని అనుమతిస్తే పక్షపాతానికి తావుండదు. విచారణ స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విచారణ సమయంలో నా వెంట న్యాయవాది ఉండేందుకు వీలుకల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. లేకుంటే నాకు కోలుకోలేని నష్టం జరగడంతోపాటు కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. నిందితుడిని విచారించేటప్పుడు న్యాయవాదిని అనుమతించాలని గతంలో సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఏసీబీ దర్యాప్తు ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ అధికరణలకు వ్యతిరేకంగా జరగకుండా చూసేందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలి’ అని కేటీఆర్ తన పిటిషన్లో హైకోర్టును కోరారు.