హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను అందజేయాలని రాష్ట్ర హోంశాఖను, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తనపై నమోదైన కేసుల వివరాలు అందజేయలని డీజీపీని కోరుతూ ఈ నెల 3న లేఖ రాసినా ఇప్పటివరకు ఇవ్వలేదని రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినందున అభ్యర్థులంతా నామినేషన్లతోపాటు వారిపై నమోదైన కేసుల వివరాలను అందజేయాల్సి ఉన్నదని గుర్తుచేశారు. దీంతో పిటిషనర్ కోరిన వివరాలను త్వరలో అందజేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అనంతరం ఈ అంశంపై విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.