హైదరాబాద్, జనవరి 4, (నమస్తే తెలంగాణ): సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం (డీబీ) సవరించింది. దీనిపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటుచేయాలని సూచించింది. ప్రశ్న పత్రాల్లో తెలుగు అనువాదం లేని నాలుగు ప్రశ్నలతోపాటు సందేహాలున్న మరో తొమ్మిది ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలని ఆదేశించింది. ఆ కమిటీలో జేఎన్టీయూ ప్రొఫెసర్లకు చోటు కల్పించకూడదని షరతు విధించింది. ఆ కమిటీ 13 ప్రశ్నలను పరిశీలించి తుదినిర్ణయం తీసుకోవాలని, ఈ ప్రక్రియ నాలుగు వారాల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. నిపుణుల కమిటీ వెల్లడించే నిర్ణయానికి పిటిషనర్లు, పోలీసు నియామక మండలి కట్టుబడి ఉండాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి, ఎంపికైన అభ్యర్థులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ప్రశ్నపత్రంలో తొలగించిన ప్రశ్నలపై సింగిల్ జడ్జి నిర్ణయం తీసుకోకుండా నిపుణుల కమిటీకి నివేదించి ఉండాల్సిందని, ఆ కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదని ధర్మాసనం అభిప్రాయపడింది. సుమారు 4,965 సివిల్ కానిస్టేబుళ్ల పోస్టుల నియామకం కోసం రాష్ట్ర పోలీసు నియామక మండలి 2022 ఏప్రిల్ 25న నోటిఫికేషన్ జారీచేసింది. అదే ఏడాది ఆగస్టు 30న రాత పరీక్షలు నిర్వహించింది. అభ్యర్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడంతోపాటు తప్పుగా ఉన్నాయని, వాటిని తొలగించాలని వినతి పత్రం సమర్పించినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి నాలుగు ప్రశ్నలను తొలగించాలంటూ గత ఏడాది అక్టోబర్లో ఆదేశించారు.
‘ప్రశ్నపత్రంలోని 122, 130, 144 ప్రశ్నలను తొలగించాలి. 122వ ప్రశ్నల్లో ‘జతపరచుము’ అంటూ ఇచ్చిన ప్రశ్నలో రాళ్లలో రకాలు, అవి ఏర్పడే విధానం గురించి తెలుగులో అనువాదం చేసి ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదు. 130వ ప్రశ్నలో పత్తి నుంచి గింజలు వేరు చేయడం, ఏకడం వంటి తెలుగు పదాలున్నా ఇంగ్లిషులో స్పిన్నింగ్, గిన్నింగ్, వీవింగ్, సెట్టింగ్ అని ఇచ్చారు. భావోద్వేగాలు, నైపుణ్యాలకు సంబంధించిన 144వ ప్రశ్నలో కూడా తెలుగు అనువాదం ఇవ్వలేదు. 57వ ప్రశ్నలో అచ్చు తప్పుదొర్లింది. ఒక ప్రశ్నలో పారాదీప్ పోర్టు అథారిటీకి బదులు ప్రదీప్ పోర్టు అథారిటీ.. అని ఇచ్చారు. ప్రశ్నపత్రం రూపకల్పనలో పోలీస్ నియామక మండలి తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. కాబట్టి తెలుగు అనువాదం లేని మూడు ప్రశ్నలను, తప్పుగా ఉన్న ప్రశ్నను తొలగించి మూల్యాంకనం చేయాలి’ అని గత ఏడాది అక్టోబర్ 9న సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారు.
అభ్యంతరాలు వ్యక్తమైన ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. జేఎన్టీయూ ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసులకు అనుగుణంగా చేశామని తెలిపింది. దీనిపై అభ్యర్థుల తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రశ్నపత్రం రూపొందించిన జెఎన్టీయూ ప్రొఫెసర్లతోనే కమిటీ ఏర్పాటు చేయడం చెల్లదని అన్నారు. పొరపాట్లు చేసిన యూనివర్సిటీ ప్రొఫెసర్ల కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించరాదని అన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లతో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, జేఎన్టీయూ ప్రొఫెసర్లకు ఆ కమిటీలో చోటు కల్పించరాదని ఉత్తర్వులు జారీచేసింది. నిపుణుల కమిటీ సిఫార్సులకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండాలని తెలిపింది. కమిటీ ఏర్పాటుకు పోలీసు నియామక మండలి చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియ నాలుగు వారాల్లోగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేసింది.