హైదరాబాద్, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు బీ రవీంద్రనాథ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. సొసైటీ రికార్డులు లోతుగా పరిశీలించాలని కూడా ఆదేశించింది. చర్యలు తీసుకునేందుకు కాల వ్యవధి లేకుండా చేయాలన్న సహకార సంఘాల అధికారుల అభ్యర్థనను హైకోర్టు తిరసరించింది.
రవీంద్రనాథ్‌పై అనర్హత వేటు వేయాలంటూ తాము అక్టోబర్ 26న ఇచ్చిన వినతిపత్రంపై కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ సొసైటీ సభ్యులు జ్యోతి ప్రసాద్, విజయభాసర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ టీ మాధవీదేవి బుధవారం విచారణ జరిపారు. పిటీషనర్ల తరఫున న్యాయవాది వాదిస్తూ, రవీంద్రనాథ్ మోసపూరితంగా సొసైటీలో సభ్యత్వం తీసుకుని ఎన్నికల్లో పోటీచేశారన్నారు. వాదనల తర్వాత ఆరు వారాల్లో ప్రెసిడెంట్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.