హైదరాబాద్,ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): విద్యుత్తు బకాయిల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కఠిన చర్యలు చేపట్టవద్దని హైకోర్టు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వానికి రూ.6756. 92 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను రా ష్ట్ర ప్రభుత్వం నిరుడు హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో తెలంగాణపై ఒత్తిడి తేవద్దని, కఠిన చర్యలు చేపట్టవద్దని గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వీటిని పొడిగించాలని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో హైకోర్టు ఆమోదించింది. ఏపీకి విద్యుత్తు బకాయిలు చెల్లించాలన్న తమ ఆదేశాలను తెలంగాణ అమలు చేయలేదని, దీం తో తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల్లో విద్యుత్తు బకాయిలను మినహాయించుకొని ఆర్బీఐ ద్వారా వాటిని ఏపీకి అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఇటీవల పార్లమెంట్లో కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.