High Court | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : రైతు కూలీలకు నిర్వచనం ఏమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారే రైతు కూలీలా, మున్సిపాలిటీల పరిధిలో ఉండే వారు కాదా అని నిలదీసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు తీరుపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. మున్సిపాలిటీల్లోని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించింది.
ఈ నెల 26న ప్రారం భించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని మున్సిపా లిటీల్లోని కూలీలకు వర్తింపజేసే వ్యవహారంపై నాలుగు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకుని తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టప్రకారం తీసుకునే నిర్ణయ సమాచారాన్ని పిటిషనర్‌కు తెలియజేయాలని చెప్పింది. పిటిషనర్ కూడా ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి వినతిపత్రం సమర్పించాలని సూచించింది. గ్రామాల్లో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో పథకాన్ని రూపొందించింది.
దీనిని గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకే వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీచేశారని, పట్టణాలు, మున్సిపాలిటీల్లోని రైతు కూలీలకు అమలు చేయకపోవడం అన్యాయమని పేరొంటూ నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఏసీజే జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చికుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసిందని, ఫలితంగా మున్సిపాలిటీల్లో ఉండే రైతు కూలీలకు తీరని అన్యాయం జరుగుతున్నదని తెలిపారు.
పథకాన్ని మున్సిపాలిటీల్లోని రైతు కూలీలకు అమలు చేయకపోవడం వివక్ష కిందకు వస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మందికి పైగా కూలీలు ఉన్నారని తెలిపారు. రైతు కూలీలందరినీ ఒకేవిధంగా చూసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు, రైతు కూలీలకు పథకం అమలుపై నాలుగు వారాల లోగా చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించి పిటిషన్‌పై విచారణను ముగించింది.