హైదరాబాద్, డిసెంబర్ 25 ( నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సర్వే నంబర్ 197, 198లోని భూముల సేల్డీడ్లను జిల్లా కలెక్టర్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పిటిషనర్లకు నోటీసులు జారీ చేయకుండా వ్యవహరించిన కలెక్టర్ చర్యలను రద్దు చేసింది. గత మేలో 453 సేల్డీడ్లను కలెక్టర్ రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వులను హైకోర్టు రద్దుచేసింది. కలెక్టర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన సుమారు 35 పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ ఇటీవల తీర్పు చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ లోకాయుక్తకు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ నియమాలు2016లోని రూల్ 243 కింద కలెక్టర్ ఆ సేల్డీడ్లు రద్దు చేశారు. ఈ చర్యను హనుమాజీపల్లికి చెందిన లింగాల పద్మ, ఇతరులు 35 పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్లకు నోటీసులు జారీ చేయకుండా, వాదనలు వినకుండా కలెక్టర్ సేల్ డీడ్స్‌ను రద్దు చేశారని తప్పబట్టారు. భూములను సెక్షన్- 22ఏ పరిధిలోకి తీసుకొనిరాలేరంటూ కలెక్టర్ ఉత్తర్వులు రద్దు చేశారు.
భూముల వివాదం 1975 నుంచి కొనసాగుతున్నది. షేక్ సలేహ్, ఇతరులు సీలింగ్ చట్టం కింద కొత్తపల్లి, రేకుర్తి లోని పలు సర్వే నంబర్లలోని భూములను మిగులు భూములుగా ప్రకటించారు. అది మోసపూరిత ప్రకటన అని 1998లో అధికారులకు ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని రిజిస్ట్రేషన్ చేయరాదని ఆర్డీవో ఉన్నతాధికారికి 1996లో లేఖ రాశారు. దీంతో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని 2017లో లోకాయుక్త ఉత్తర్వులిచ్చారు. దీంతో అవి ప్రభుత్వ భూములని కలెక్టర్ రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. కలెక్టర్ నిర్ణయాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు. పిటిషనర్లకు తమ వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం చెల్లదని హైకోర్టు తేల్చింది.