హైదరాబాద్, అక్టోబర్5 (నమస్తే తెలంగాణ): నిబంధనల ప్రకారం తెలంగాణలో వరుసగా నాలుగేండ్ల్లు నివాసం ఉండి, అర్హత పరీక్ష నీట్ రాసినట్లయితే మెడికల్ అడ్మిషన్లలలో స్థానిక కోటా కింద పరిగణించాలని కాళోజీ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. 2019 నుంచి తెలంగాణలో ఉంటూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించినప్పటికీ స్థానిక కోటా కింద పరిగణించకపోవడం అన్యాయమంటూ అనమ్తా ఫరూక్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ పదో తరగతి వరకు దుబాయ్‌లో చదువుకున్నాడని, 2019లో తెలంగాణకు వచ్చి ఇకడే ఇంటర్మీడియట్ పూర్తిచేశాడని విద్యార్థి తరఫు న్యాయవాది చెప్పారు. నాలుగేండ్లుగా స్థానికంగా ఉంటున్నట్టు శేరిలింగంపల్లి ఎమ్మార్వో ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ పిటిషనర్‌ను స్థానికేతరునిగా చూపడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు, పిటిషనర్ వరుసగా నాలుగుండ్లు తెలంగాణలో నివాసం ఉండటంతోపాటు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, నీట్ తెలంగాణలో ఉత్తీర్ణత సాధించినందున మెడికల్ అడ్మిషన్లలో స్థానిక కోటా కింద పరిగణించాలని ఆదేశించింది.