హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటిడ్ (టీజీఎస్పీడీసీఎల్)కు బకాయి ఉన్న విద్యుత్తు బకాయిలు మొత్తంలో సగం రూ.54 కోట్లు తక్షణం చెల్లించాలని గీతం ట్రస్టును హైకోర్టు ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ చెల్లించకపోతే విద్యుత్తు కనెక్షన్ తొలగింపుపై టీజీఎస్పీడీసీఎల్ తగిన నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీఎల్ సెప్టెంబర్ 12న జారీచేసిన నోటీసులను సవాల్ చేస్తూ గీతం వర్సిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. రూ.118 కోట్ల బకాయి (రూ.108 కోట్లు +రూ.10 కోట్లు వడ్డీ) ఉన్నా యూనివర్సిటీ మీద చర్యలు చేపట్టని అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ నెల 20 విద్యుత్తు సరఫరాను నిలిపివేసింది.
ఈ నేపథ్యంలో విద్యుత్తు కనెక్షన్‌ను పునరుద్ధరించేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ గీతం వర్సిటీ మధ్యంతర పిటిషన్ దాఖలుచేసింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎస్పీడీసీఎల్ చేసిన అప్పీల్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ముందుగా జారీచేసిన నోటీసుల్లోని రూ.108 కోట్లలో సగం మొత్తాన్ని మూడు వారాల్లో చెల్లించాలని గీతం వర్సిటీని ఆదేశించింది. చెల్లించని పక్షంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఎస్పీడీసీఎల్కు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.