హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పార్టీలకు భూకేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఆ పార్టీలకు కేటాయించిన భూమిపై పిటిషనర్లకు యాజమాన్య హక్కులు లేవని గుర్తు చేసింది. పిటిషనర్ల నుంచి భూసేకరణ కూడా చేయలేదని, పిటిషనర్లు బాధితులు కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు భూముల కేటాయింపులను రద్దు చేయాలన్న పిటిషన్లలో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని మంగళవారం ప్రకటించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు భూములు కేటాయిస్తూ వెలువడిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి బస్తీవాసులు 310 పిటిషన్లు దాఖలు చేశారు. అందులో 222 పిటిషన్లపై మంగళవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. బోయినపల్లిలో త్రిశూల్ పార్క్ వద్ద సర్వే నం 503, 502లో 10 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం కేటాయించిందని, గత ఏప్రిల్ 28న దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయని పిటిషనర్ న్యాయవాది బోయిన సుబ్రహ్మణ్యం కోర్టుకు చెప్పారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని సర్వే 239, 240 నెంబర్లల్లోని 11 ఎకరాలను బీఆర్ఎస్కు కేటాయించిందని తెలిపారు. ఆ భూమిని పేదలకు ఇస్తామని 1996లో ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదని పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.800 కోట్ల విలువైన ఆ భూమిని రాజకీయ పార్టీకి ఎకరం రూ.రెండు లక్షలకే కేటాయించిందని వివరించారు. ఈ వాదనను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్ తిప్పికొట్టారు. పిటిషనర్లకు భూములపై హక్కులు లేవని, అలాంటి వాళ్లు భూకేటాయింపులపై అభ్యంతరం చెప్పేందుకు వీల్లేదని అన్నారు. కేటాయింపులతో వారికి సంబంధంలేదని తెలిపారు. వాదనల తర్వాత పిటిషనర్లకు సంబంధం లేని భూమిని ఫలానా పార్టీకి కేటాయించడం అన్యాయమని చెప్పడం సరికాదని ధర్మాసనం పేర్కొన్నది. ఇదే తరహాలోని మరో 90 పిటిషన్లపై బుధవారం విచారణ చేపడతామని ప్రకటించింది.