హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): శబ్ద కాలుష్యంతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న పబ్బులపై చేపట్టిన చర్యలేమిటో తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి రాయదుర్గ్‌లోని రెడ్ రైనో పబ్, పోస్ట్‌కార్డ్ రెస్టారెంట్, గ్లోబల్ తపస్ బార్ల నుంచి వెలువడుతున్న శబ్ద కాలుష్యం ఆ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నదంటూ బర్కత్పురాకు చెందిన ఆనంద్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పబ్బులకు జారీ చేసిన అనుమతులను రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అధికారులకు నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.