హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కనీస వేతనాలకు సంబంధించి గెజిట్ను ప్రచురించాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ వ్యవహారంపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఐదేండ్లకోసారి కనీస వేతనాలను సవరిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ 2007 తర్వాత నుంచి ఇప్పటివరకు విడుదల చేయలేదంటూ 2023లో తెలంగాణ రీజినల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. దీంతో వెంటనే గెజిట్ను ప్రచురించాలని హైకోర్టు అప్పట్లోనే ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, ఆ ఆదేశాలు నేటికీ అమలు కాకపోవడంతో తాజాగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.