హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఎస్బీఐలో విలీనమైన ఆయా బ్యాంకుల ఉద్యోగులకు ఎస్బీఐ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు సోమవారం ఆర్బీఐకి నోటీసులు జారీచేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 10కి వాయిదావేసింది. ఎస్బీఐలో విలీనమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెనోర్ ఉద్యోగులకూ ఎస్బీఐ ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలు కల్పించాలన్న పిటిషన్‌ను ఇటీవల సింగిల్ జడ్జి కొట్టివేశారు.
దీనిపై పీటీఎం గోపాలకృష్ణ, ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది శ్రీపాద ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ విలీనమైన బ్యాంకు ఉద్యోగులపట్ల ఎస్బీఐ సవతి తల్లి ప్రేమను చూపుతున్నదని చెప్పారు. ఎస్బీఐ ఉద్యోగులతో సమానంగా పరిగణించాలన్న తమ అభ్యర్థనను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఎస్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిసూ, ఇది విధాన నిర్ణయమని, విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని అన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఆర్బీఐ వాదనను కూడా పరిగణనలోకి తీసుకుంటామంటూ నోటీసులు జారీ చేసింది. ఇరుపక్షాలు సంక్షిప్తంగా రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.