హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి రూ.6,756.92 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాలని తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆదేశాల అమలును గతంలోనే నిలిపివేసిన హైకోర్టు.. ఇటీవల ఈ అంశంపై మరోసారి విచారణ చేపట్టి కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ఏ చట్టం ప్రకారం ఆ ఆదేశాలిచ్చారో చెప్పాలని నిలదీసింది. కేంద్ర జోక్యం రాష్ట్ర పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టడం, విద్యుత్తు బకాయిలకు సంబంధించి నిరుడు ఆగస్టు 29న మోదీ సర్కార్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరడంతో హైకోర్టు ఈ నోటీసులను జారీచేసింది.
తెలంగాణ, ఏపీ మధ్య విభేదాలు తలెత్తితే దక్షిణ ప్రాంతీయ మండలిలో చర్చించి పరిష్కరించుకోవాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని, విద్యుత్తు బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవడం ద్వారా ఆ నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్తు పంపిణీ సంస్థలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా తెలంగాణ తరఫు న్యాయవాది వాదిస్తూ.. దక్షిణ ప్రాంతీయ మండలిలో చర్చలు ఫలించని పక్షంలోనే విద్యుత్తు బకాయిలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇవ్వాల్సి ఉన్నదని, అంతేతప్ప నేరుగా ఆదేశాలు ఇచ్చే అధికారం కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శికి లేదని తెలిపారు. దీనిపై ఏపీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కేంద్ర జోక్యం వల్లే ఏపీ డిసంలు తెలంగాణకు విద్యుత్తును సరఫరా చేశాయని, కనుక కేంద్రం ఆదేశాలను తెలంగాణ అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు.
దీంతో ఏపీకి విద్యుత్తు బకాయిలు చెల్లించాలని తెలంగాణను ఆదేశిస్తూ మోదీ సర్కార్ జారీచేసిన ఉత్తర్వుల ఫైళ్లన్నింటినీ తమకు అందజేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆ ఆదేశాలిచ్చారో చెప్పాలని పేర్కొన్నది. దీనిపై కేంద్రం సమర్పించే వివరాలను పరిశీలించాక తెలంగాణ పిటిషన్లపై విచారణ చేపట్టి తగు ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేసింది. విద్యుత్తు బకాయిల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఈ వ్యాజ్యాల విచారణ అడ్డంకి కాబోదని హైకోర్టు పేర్కొంటూ.. తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. కాగా, ఈ అంశంపై తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.