హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): దవాఖానల్లో బయో మెడికల్ వ్యర్థాల సేకరణకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీచేసిన కొత్త బిల్లింగ్ విధానానంపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. నూతన బిల్లింగ్ విధానం సబబుగానే ఉన్నదని పేర్కొంటూ.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఆసారం లేదని స్పష్టం చేసింది. కొత్త బిల్లింగ్ విధానంపై సమీక్ష జరిపి నిర్దిష్ట కాలవ్యవధిలోగా తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఆదేశించింది.
దవాఖానల్లో బయో మెడికల్ వ్యర్థాల సేకరణ, శుద్ధికి సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు రాష్ట్ర పీసీబీ 2025 జూన్ 4న జారీచేసిన సర్యులర్‌ను సవాలు చేస్తూ తెలంగాణ దవాఖానలు, నర్సింగ్‌హోమ్‌ల అసోసియేషన్ (తానా) తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను పరిశీలించాకే తెలంగాణ పీసీబీ ఈ సర్యులర్‌ను జారీ చేసిందని, దవాఖానలు, చిన్న క్లినిక్‌లలో ఉత్పత్తయ్యే వ్యర్థాల పరిమాణం, ప్రమాదరకర స్వభావంలో ఉన్న వ్యర్థాల మధ్య తేడా ఆధారంగా చార్జీలను వర్గీకరించడం ఏకపక్షం కాబోదని తీర్పు వెలువరించింది.